అలీ కాట్రవల్లి 'జబర్దస్త్'

Fri May 24 2019 16:19:25 GMT+0530 (IST)

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు గత ఏడు సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ను ఆధరిస్తూనే ఉన్నారు. జబర్దస్త్ షో కారణంగా ఈటీవీ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. షో ఆరంభం నుండి కూడా జడ్జ్ లుగా నాగబాబు రోజాలు వ్యవహరించారు. అప్పుడప్పుడు వారు బిజీగా ఉంటే గెస్ట్ జడ్జ్ లు వచ్చారు. రష్మీ అనసూయలు యాంకర్ లుగా మొదటి నుండి కొనసాగుతూ వస్తున్నారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల కారణంగా కొత్త జడ్జ్ లు కనిపిస్తున్నారు. కొన్ని వారాలు కనిపించకుండా పోయిన రోజా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కాని నాగబాబు మాత్రం ఇంకా ఇవ్వలేదు.ప్రస్తుతం నాగబాబు స్థానంలో మీనా కనిపిస్తోంది. ఆ తర్వాత ఎపిసోడ్స్ లో అలీ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగబాబు స్థానంను అలీ రిప్లేస్ చేస్తాడనే టాక్ వినిపిస్తుంది. అయితే కొన్ని వారాల క్రితం నాగబాబు తాను ఎంపీగా గెలిచినా కూడా జబర్దస్త్ కు జడ్జ్ గా వ్యవహరిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. కాని ఎన్నికలు జరిగి దాదాపు రెండు నెలలు అవుతున్నా కూడా ఇంకా నాగబాబు రీ ఎంట్రీ ఇవ్వలేదు.

ఈ సమయంలోనే అలీ సీన్ లోకి వచ్చిన నేపథ్యంలో నాగబాబు రీ ఎంట్రీ గురించిన అనుమానాలు మరింతగా వ్యక్తం అవుతున్నాయి. రీ ఎంట్రీ ఇస్తానంటూ బలంగా చెప్పిన నాగబాబు ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా జబర్దస్త్ కు వస్తాడని అంటున్నారు. మరి అలీ ఎందుకని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ మీనాల మాదిరిగా గెస్ట్ జడ్జ్ లుగా అలీ కూడా గెస్ట్ గా వచ్చి వెళ్తాడేమో చూడాలి. ఇక మరో వైపు జబర్దస్త్ కు రోజా గుడ్ బై చెప్పే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో వైకాపా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని జగన్ సీఎం అవ్వబోతున్న నేపథ్యంలో రోజాకు మంత్రి పదవి దక్కడం ఖాయం అంటున్నారు. అందుకే మంత్రి అయితే రోజా జబర్దస్త్ ను వదిలేసే అవకాశం ఉంది. అప్పుడు రోజా స్థానంలో ఎవరొస్తారో చూడాలి.