క్రైమ్ థ్రిల్లర్ ను లైన్ లో పెట్టిన మహర్షి ఫ్రెండ్!

Tue Feb 19 2019 12:54:56 GMT+0530 (IST)

అల్లరి నరేష్ సినిమాలంటే కొన్నేళ్ళ క్రితం మినిమమ్ గ్యారెంటీ ఉండేది.  కానీ ఇప్పుడు కామెడీ హీరోల సినిమాలేవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతం కావడం లేదు.  ఇంట్లోనే జబర్ధస్ట్.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లాంటి టీవీ కార్యక్రమాలు దట్టంగా దట్టించిన మసాలాతో ఫుల్ కామెడిని పంచుతుండడంతో కామెడీ హీరోల సినిమాలకు డిమాండ్ తగ్గిందని ఒక విశ్లేషణ ఉంది. అది నిజమో కాదో తెలీదు గానీ ఇప్పుడు అల్లరి నరేష్ లాంటి హీరోలకు మాత్రం కష్టంగానే ఉంది.మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' లో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా తర్వాత నరేష్ సోలో హీరోగా ఒక సినిమాను లైన్లో పెట్టాడట.  కానీ ఇందులో సర్ ప్రైజ్ ఏంటంటే ఈ సినిమా కామెడి ఎంటర్టైనర్ కాదు.. ఇదో క్రైమ్ కామెడి థ్రిల్లర్ అని సమాచారం.   ఈ సినిమాకు ఈ. సత్తిబాబు దర్శకుడు.  అల్లరి నరేష్ తో గతంలో 'బెట్టింగ్ బంగార్రాజు'.. 'యముడికి మొగుడు'.. 'జంప్ జిలాని' లాంటి సినిమాలను తెరకెక్కించాడు సత్తిబాబు. మరోసారి ఆయన నరేష్ తో సినిమా రూపొందించేందుకు రెడీ అయ్యాడు.

ఈ సినిమాకు కథ.. డైలాగులు విక్రమ్ రాజ్ అందిస్తున్నాడట.  అడివి శేష్ తో '2 స్టేట్స్' రీమేక్ నిర్మిస్తున్న లక్ష్య ప్రొడక్షన్స్ వారు ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ను నిర్మిస్తారట.  ఈ చిత్రాన్ని మే నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట.  ఈ సినిమాతో అయినా నరేష్ మళ్ళీ తన కెరీర్లో మంచి విజయం సాధిస్తాడేమో వేచి చూడాలి.