స్పెషల్ పిక్: మహర్షిలో అల్లరోడి లుక్

Sat Dec 15 2018 22:37:24 GMT+0530 (IST)

ప్రిన్స్ మహేష్ బాబు మహర్షి వచ్చే ఏప్రిల్ 5 కోసం అభిమానుల ఎదురుచూపులు మాములుగా లేవు. చిన్న టీజర్లో లుక్స్ తోనే అందరి మనసులు దోచేసిన సూపర్ స్టార్ రాక గురించి సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన హైప్ ఉంది. కాకపోతే ఇప్పటిదాకా ఇందులో మహేష్ తప్ప ఇంకే పాత్రకు సంబంధించిన లుక్స్ బయటికి రాలేదు. ముఖ్యంగా అల్లరి నరేష్ ఎలా కనిపిస్తాడు అనేదాని గురించి చాలా ఆసక్తి నెలకొంది. అఫీషియల్ గా కాదు కాని మరో రూపంలో అల్లరి నరేష్ ఇందులో ఎలా ఉంటాడో బయటికి వచ్చేసింది. ఎవరో అభిమానుల పిల్లలతో హైదరాబాద్ లో వేసిన విలేజ్ సెట్ లో షూటింగ్ బ్రేక్ సందర్భంగా తీసిన ఫోటో బయటికి వచ్చేసింది.బాగా పెరిగిన గుబురు గెడ్డంతో సాధారణంగా అనిపించే మాములు దుస్తుల్లో చూస్తుంటే అల్లరి నరేష్ కు కీలకంగా చెప్పబడుతున్న ఈ విలేజ్ ఎపిసోడ్ కు బలమైన కనెక్షన్ ఉన్నట్టు అర్థమైపోతోంది. మహేష్ అమెరికా నుంచి ఇండియాలోని ఈ చిన్న పల్లెటూరికి రావడానికి కారణమే తనతో పాటు కాలేజీలో చదువుకున్న అల్లరి నరేష్ పాత్రని ఇంతకు ముందే ఓ కథనం వచ్చింది. అయితే దానికి బలం చేకూర్చేలా ఇప్పుడీ ఫొటోలోని అల్లరి నరేష్ అవతారం ఉండటంతో పోలిక మ్యాచ్ అవుతోంది. అసలు ఇతను ఎదురుకున్న సమస్య ఏంటి ఎక్కడో అమెరికాలో ఉన్న మహర్షి ఉన్నఫళంగా ఇక్కడికి రావడానికి కారణం లాంటి వివరాలు తెలియాలంటే ఇంకో మూడున్నర నెలలు ఆగాల్సిందే.

అన్నట్టు అల్లరి నరేష్ ఇంత బారు గెడ్డంతో మీసాలతో ఏ సినిమాలోనూ నటించలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం గమ్యంలో పాత్రను మించిన రెట్టింపు ఎమోషన్ ఇందులో నరేష్ పాత్రకు ఉంటుందని అందుకే ఛాలెంజ్ గా అనిపించడంతో పాటు మహేష్ స్ట్రాంగ్ గా రికమండ్ చేయటం వల్ల వంశీ పైడిపల్లి కోరుకున్నట్టే మహర్షిలో అల్లరి నరేష్ ఎంట్రీ జరిగిందట. ఎలా అయితేనేం మొత్తానికి మహర్షిలో అల్లరోడి దర్శనం ఈ రకంగా అయినా జరిగిపోయింది.