Begin typing your search above and press return to search.

అల్లరోడిని దెబ్బ తీసిన సినిమాకు సీక్వెల్

By:  Tupaki Desk   |   23 Nov 2017 9:33 AM GMT
అల్లరోడిని దెబ్బ తీసిన సినిమాకు సీక్వెల్
X
అల్లరి నరేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచిన సినిమా ‘సుడిగాడు’. ఆరేళ్ల కిందట విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే రూ.15 కోట్ల దాకా వసూలు చేసి.. ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. అల్లరోడి స్థాయికి అది చాలా పెద్ద మొత్తమే. ఐతే ఈ సినిమా అల్లరి నరేష్ కు ఆ సమయానికి ఎంత మేలు చేసిందో.. ఆపై అంత చేటు కూడా చేసింది. అప్పటిదాకా ప్రతి సినిమాలోనూ కొంచెం కొంచెం స్పూఫులు.. పేరడీలతో అలరిస్తూ వచ్చిన నరేష్.. ఈ సినిమాలో ఒకేసారి పది సినిమాలకు సరిపడా స్పూఫ్-పేరడీ వినోదాన్ని అందించాడు. దీంతో ప్రేక్షకులకు కడుపు నిండిపోయింది. ఆ తర్వాత అతను ఆ తరహా కామెడీ చేస్తే జనాలకు మొహం మొత్తేసింది. వరుసగా అతడి సినిమాలన్నీ తేడా కొట్టాయి. కెరీర్ గాడి తప్పింది.

ఐతే ఇకపై స్పూఫులు.. పేరడీలు చేయనంటే చేయనని తెగేసి చెప్పిన నరేష్.. ఇప్పుడు తన కెరీర్ ను గాడిలో పెట్టుకోవడానికి మళ్లీ ‘సుడిగాడు’నే నమ్ముకుంటుండటం విశేషం. ‘సుడిగాడు’.. తమిళంలో హిట్టయిన ‘తమిళ్ పడం’ సినిమాకు రీమేక్. ఇప్పుడు తమిళంలో దానికి సీక్వెల్ వస్తోంది. ఈ సినిమా విడుదల కాకముందే భీమనేని శ్రీనివాసరావు దాని రీమేక్ రైట్స్ తీసేసుకున్నాడట. నరేష్ హీరోగా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. మరి తమిళంలో ఆ చిత్రం ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి. మరి ‘సుడిగాడు’లో ఒక్క టికెట్ మీద వంద సినిమాలు చూపించిన భీమనేని.. ఈసారి కొత్తగా ఏం చూపిస్తాడన్నది ఆసక్తికరం. ‘సుడిగాడు’ వచ్చే సమయానికి ఆ తరహా కామెడీని జనాలు బాగా ఎంజాయ్ చేసేవాళ్లు. ఇప్పుడు ట్రెండు మారింది. మళ్లీ అదే తరహా ఎంటర్టైన్మెంట్ అంటే కష్టం. మరి కొత్తగా ఏమైనా ట్రై చేస్తారా.. మళ్లీ అదే వినోదం వడ్డిస్తారా అన్నది చూడాలి.