Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురికీ బ్రేక్ కావాలి

By:  Tupaki Desk   |   22 Jun 2018 7:09 AM GMT
ఆ ముగ్గురికీ బ్రేక్ కావాలి
X
టైం బాలేనప్పుడు మనలాంటి వాళ్లను కలుపుకుపోతే కలిసి వచ్చే అవకాశం ఉంటుందని సినిమా పరిశ్రమలో గతంలో చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. కాకపోతే దానికి అన్ని కలిసి రావాలి. హీరోలు సునీల్-అల్లరి నరేష్ తో పాటు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ఇలాంటి ఫలితం కోసమే కాంబోగా మారారు. సిల్లీ ఫెలోస్ పేరుతో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. భీభత్సమైన రెస్పాన్స్ అని చెప్పలేం కానీ ఉన్నంతలో కొంత ఆసక్తి అయితే రేపింది. సునీల్ హీరో అయ్యాక కామెడీ వేషాలకు పూర్తిగా స్వస్తి పలికాడు. మర్యాద రామన్న-పూల రంగడు విజయాలు ఇచ్చిన నమ్మకంతో తనకు సూట్ కానీ మాస్ కథలతో చేసిన ప్రయోగాలన్నీ తిప్పి కొట్టారు ప్రేక్షకులు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న సునిల్ లాంటి హాస్య నటుడు ఇలా హీరో జానర్ కు కట్టుబడటం వాళ్ళు సైతం ఇష్టపడలేదు. అందుకే మళ్ళి తన పాత ట్రాక్ లోకి వచ్చి సునీల్ సిల్లీ ఫెలోస్ లో పూర్తి స్థాయి కామెడీ పాత్ర పోషించినట్టు ఇన్ సైడ్ టాక్. అల్లరి నరేష్ ని లీడ్ లో చూపుతూ ఎక్కువ శాతం కామెడీ పార్ట్ తనపై ఉండేలా స్క్రిప్ట్ రాసుకున్నట్టు వినికిడి . అల్లరి నరేష్ హిట్టు కొట్టి చాలా కాలమే అయ్యింది. గత నాలుగేళ్లలో వచ్చిన హిట్ సినిమా ఏది అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి అందుకే తనకూ ఇది చాలా కీలకం.

ఇక దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు సంగతి తీసుకుంటే ఆ మధ్య అల్లరి నరేష్ తోనే సుడిగాడు తీసి హిట్టు కొట్టినా తర్వాత మాత్రం ఫామ్ లోకి రాలేకపోయారు. ఒకప్పుడు వెంకటేష్-పవన్ కళ్యాణ్-జగపతి బాబు లాంటి స్టార్ హీరోలతో ఎవర్ గ్రీన్ హిట్స్ ఇచ్చిన భీమినేని తన ఉనికిని చాటుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు. సుడిగాడు తరహాలోనే సిల్లీ ఫెలోస్ ని కూడా అవుట్ అండ్ అవుట్ స్పూఫ్ కామెడీతో డీల్ చేసినట్టు వినికిడి. ఈ మధ్య జనం స్పూఫ్ ల పట్ల ఏమంత ఆసక్తిగా లేరు. మరి దీన్ని వాళ్ళను మెప్పించేలా భీమినేని ఎలా తీర్చిద్దిద్దాడు అనే దాని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ముగ్గురు కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం మంచి ఫలితమే ఇవ్వాలని హాస్య చిత్రాల అభిమానులు కోరుకుంటున్నారు. మరి సిల్లీ ఫెలౌస్ ఎంత సీరియస్ గా వర్క్ అవుట్ చేసారు అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.