అన్ని కళ్ళూ కళ్యాణ్ రామ్ వైపే

Fri Sep 21 2018 18:46:33 GMT+0530 (IST)

ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ అంచనాలు పెంచడంలో పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతోంది. ప్రమోషన్ విషయంలో తనకు పోటీగా ఉన్న సినిమాల కంటే చాలా అడ్వాన్స్ గా ఉన్న క్రిష్ యూనిట్ ప్రతి సందర్భాన్ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుని లుక్స్ పేర్లతో పోస్టర్లను వదిలి ఆసక్తిని పెంచుతున్నారు. నిన్న ఏఎన్నార్ జయంతి సందర్భంగా వదిలిన రెండు సుమంత్ పోస్టర్లు అద్భుతమైన స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాని కన్నా ముందు నారా చంద్రబాబునాయుడుగా రానా మేకోవర్ చూసి రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసాయి. గెటప్ ల విషయంలో క్రిష్ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరి లుక్ బయటికి వస్తుందా అనే ఉత్సుకతతో ఉన్నారు అభిమానులు. ముందుగా బసవతారకంగారి రూపంలో విద్యా బాలన్ బయటికి వచ్చే అవకాశం ఉంది కానీ అంత కన్నా ముందుగా ఇటీవల అకాల మరణం చెందిన హరికృష్ణగా కళ్యాణ్ రామ్ ఎలా ఉండబోతున్నాడు అనే ఆసక్తి  ఫ్యాన్స్ లో ఎక్కువగా  ఉంది.త్వరలోనే కళ్యాణ్ రామ్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు తన మొదటి యాత్రను శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టారు. అప్పుడు వాడిన చైతన్య రధం వాహనాన్ని వందల కిలోమీటర్లు హరికృష్ణ స్వయంగా డ్రైవ్ చేసేవారు. ఇప్పుడు ఆయన పాత్రలోనే కళ్యాణ్ రామ్ కనిపిస్తాడు. సహజత్వం కోసం షూట్ శ్రీకాకుళంలోనే చేయాలనీ క్రిష్ డిసైడ్ అయినట్టు టాక్. ఆ రధాన్ని కొంతకాలం క్రితమే సిద్ధం చేసారు. మరి ఎప్పటి నుంచో మొదలవుతుంది అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు కానీ స్టార్ట్ చేయటం ఆలస్యం ఎక్కువ గ్యాప్ లేకుండా క్రిష్ కళ్యాణ్ రామ్ లుక్ ని రివీల్ చేయటం ఖాయం. మొత్తానికి ఎన్టీఆర్ టీమ్ ప్రమోషన్ విషయంలో సంక్రాంతికే రాబోతున్న రాంచరణ్-బోయపాటిల సినిమా వెంకటేష్-వరుణ్ తేజ్ ల ఎఫ్2 కంటే ఓ రెండడుగులు ముందే ఉంది. మరి అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ హరికృష్ణ రూపంలో కళ్యాణ్ రామ్ ఎలా ఉండబోతున్నాడో త్వరలో చూసే అవకాశం ఉంది.