Begin typing your search above and press return to search.

లయన్ కింగ్ కు టాలీవుడ్ టచ్ ఇచ్చిన అలీ బ్రమ్మి!

By:  Tupaki Desk   |   20 Jun 2019 12:06 PM GMT
లయన్ కింగ్ కు టాలీవుడ్ టచ్ ఇచ్చిన అలీ బ్రమ్మి!
X
హాలీవుడ్ చిత్రాలలో యానిమేషన్ చిత్రాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తెరపై కనిపించే కార్టూన్ పాత్రలకు ప్రముఖ హాలీవుడ్ స్టార్లు తమ గాత్రం అందించడం కూడా అక్కడ చాలా సాధారణమైన విషయం. అందుకే ఈ సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంటుంది. కొంతకాలం క్రితం విడుదలైన 'జంగిల్ బుక్' భారీ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు డిస్నీ వారు 'ది లయన్ కింగ్' ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఫోటో రియలిస్టిక్ కంప్యూటర్ యానిమేషన్ విధానంలో తెరకెక్కించిన ఈ సినిమా జులై 19 న రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ తో పాటుగా పలు భారతీయ భాషలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సింబా.. ముఫాసా.. పుంబా.. టిమోన్ పాత్రలు ఉంటాయనే సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పుడు పుంబా.. టిమోన్ పాత్రలకు ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లు బ్రహ్మానందం.. అలీ గాత్రం అందించారు.

బ్రహ్మానందం ఈ సినిమాలో భాగస్వామి కావడం గురించి మాట్లాడుతూ "పుంబా పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఒక ఫన్ ఎక్స్ పీరియన్స్. నా ఫ్యాన్స్ అందరికీ లయన్ కింగ్ ను పర్సనల్ టచ్ తో ప్రెజెంట్ చేస్తున్నాను" అన్నారు. 'ది లయన్ కింగ్' తనే కాదు తన కుటుంబ సభ్యులు అభిమానులని చెప్పారు. మరో స్టార్ కమెడియన్ అలీ మాట్లాడుతూ "మా పిల్లలకు డిస్నీ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. డిస్నీ వారి లయన్ కింగ్ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. టిమోన్ పాత్రకు వాయిస్ ఇవ్వడం ఫన్ గా ఉంది. తెలుగులో ఈ సినిమా చూసే నా ఫ్యాన్స్ కు ఇదో సర్ ప్రైజ్" అన్నారు.