Begin typing your search above and press return to search.

మల్టీఫ్లెక్సుల‌కు అకున్ వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   18 July 2018 4:17 AM GMT
మల్టీఫ్లెక్సుల‌కు అకున్ వార్నింగ్‌!
X
మ‌ల్టీఫ్లెక్సుల‌కు వెళ్లే వారికి శుభ‌వార్త‌. స‌ర‌దాగా సినిమాకు వెళ్లే ప్ర‌తిఒక్క‌రు బ్రేక్ వేళ‌.. తినుబండ‌రాలు కొనేందుకు ప్ర‌య‌త్నించ‌టం.. ఆ సంద‌ర్భంగా క‌ళ్ల ముందు చుక్క‌లు క‌నిపించేలా మ‌ల్టీఫ్లెక్సుల్లో స్నాక్స్ ధ‌ర‌లు ఉండ‌టం తెలిసిందే. పాప్ కార్న్ లాంటివి అయితే.. మీడియం.. లార్జ్.. అంటూ భారీగా బాదేయ‌టం.. సినిమా టికెట్ ధ‌ర కంటే కూడా స్నాక్స్ ధ‌ర‌లు భారీగా ఉండ‌టం తెలిసిందే.

ఈ తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు.. ఫిర్యాదులు వ‌చ్చినా ఇంత‌కాలం అధికారుల స్పంద‌న అంతంత మాత్రంగానే ఉండేది. దీనిపై తెలంగాణ తూనిక‌లు కొల‌త‌ల శాఖ రంగంలోకి దిగ‌టం.. మ‌ల్టీఫ్లెక్సుల దోపిడీపై క‌న్నేశారు  ఆ శాఖ కంట్రోల‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అకున్ స‌బ‌ర్వాల్‌.

గ‌డిచిన నెల‌లో ప‌లు మ‌ల్టీఫ్లెక్సుల్లోనూ..థియేట‌ర్ల‌లోనూ త‌నిఖీలు నిర్వ‌హించిన ఆయ‌న‌.. ఎమ్మార్పీ కంటే అధిక ధ‌ర‌ల‌కు అమ్ముతున్న వారిపై కేసులు న‌మోదు చేశారు. కొన్ని ఆహార‌ప‌దార్థాల‌ను స్మాల్.. మీడియం.. లార్జ్.. ఎక్స‌ట్రా లార్జ్ పేరుతో భారీగా బాదేస్తూ అమ్మ‌కాలు జ‌ర‌ప‌టం కూడా స‌రికాద‌ని.. థియేట‌ర్లో అమ్మే ప్ర‌తి వ‌స్తువుకూ ఎమ్మార్పీ ధ‌ర ఉండాల్సిందేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

అంతేకాదు.. ప్యాక్ మీద ముద్రించిన ధ‌ర కంటే పైసా అద‌నంగా వ‌సూలు చేసినా తీవ్ర చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని మ‌ల్టీఫ్లెక్స్ ప్ర‌తినిధుల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో వార్నింగ్ ఇచ్చేశారు. అంతేకాదు.. పాప్ కార్న్.. స్వీట్ కార్న్.. ఐస్ క్రీం లాంటి వాటిని స్మాల్.. మీడియం.. బిగ్‌.. జంబో లాంటి పేర్ల‌తో అమ్మ‌టం చ‌ట్ట‌విరుద్ద‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

అలాంటి వాటికి  ఎన్ని గ్రాముల‌కు.. ఎంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తున్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసేలా ప్యాకింగ్ ఉండాల‌ని.. ప్ర‌తి దాని మీదా ఆ వివ‌రాలు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని పేర్కొన్నారు. దీనికి నెల‌లో అమ‌లు చేయాల‌ని మ‌ల్టీఫ్లెక్సు.. థియేట‌ర్ల ప్ర‌తినిధుల‌ను కోర‌గా.. వారు సెప్టెంబ‌రు 1 వ‌ర‌కు గ‌డువు కావాల‌ని.. అంత‌లోపు  అకున్ చెప్పిన మార్పులు చేస్తామ‌ని చెప్పారు. రూల్స్ కు విరుద్ధంగా ఎవ‌రైనా వ్య‌వ‌హ‌రిస్తే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ కు విరుద్ధంగా అధిక ధ‌ర‌లు వ‌సూలు చేసే వారిపై టోల్ ఫ్రీ నంబ‌రు 180042500333 - వాట్సప్‌ 73307 74444కు సమాచారం అందించాల‌ని కోరారు.ఇంత‌కాలం మల్టీఫ్లెక్సుల్లోనూ.. థియేట‌ర్ల‌లోనూ భారీ బాదుడుకు ఫ‌స్ట్రేట్ అయ్యే వారంతా.. ఆ ప‌ని ఆపే వెంట‌నే కంప్లైంట్ చేయాల్సిన టైం వ‌చ్చేసింది.