Begin typing your search above and press return to search.

అమీర్.. షారుఖ్.. అక్షయ్ వెనుకే

By:  Tupaki Desk   |   21 Aug 2017 8:27 AM GMT
అమీర్.. షారుఖ్.. అక్షయ్ వెనుకే
X
మొత్తానికి బాలీవుడ్ ‘బాహుబలి: ది కంక్లూజన్’ హ్యాంగోవర్ నుంచి బయటపడ్డట్లే ఉంది. ఆ సినిమా వచ్చినప్పటి నుంచి మరే హిందీ సినిమా కూడా ఆడింది లేదు. సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్ లైట్’.. షారుఖ్ ఖాన్ ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ కూడా దారుణమైన ఫలితాలు చవిచూడగా.. మిగతా సినిమాలూ అంతంతమాత్రంగానే ఆడాయి. ఐతే ఎట్టకేలకు బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఓ హిందీ సినిమా కళకళలాడిస్తోంది. అదే.. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’.

తొలి వీకెండ్లో దుమ్ము దులిపిన ఈ సినిమా సెకండ్ వీకెండ్లోనూ జోరు చూపించింది. శుక్ర-శని-ఆదివారాల్లో కలిపి ఇండియాలో రూ.19 కోట్ల గ్రాస్ వసూలు చేసిందీ చిత్రం. రెండో వీకెండ్లో ఓ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషమే. అందులోనూ ఇది ఏ ఖాన్ నటించిన సినిమా కాదు. అక్షయ్ కుమార్ హీరోగా చేసిన సినిమా. అక్షయ్ కుమార్ కెరీర్లోనే అత్యంత వేగంగా ఇండియాలో రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న సినిమాగా ‘టాయిలెట్..’ రికార్డు సృష్టించింది.

ఇప్పటికే ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.115 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.140 కోట్ల దాకా ఉన్నాయి. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. అక్షయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. మరో విశేషం ఏంటంటే.. అక్షయ్ కు ఇది తొమ్మిదో 100 కోట్ల సినిమా. సల్మాన్ ఖాన్ 11 వంద కోట్ల సినిమాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. అమీర్ ఖాన్.. షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లు కూడా అక్షయ్ వెనుకే ఉండటం విశేషం.