తాత నాన్న దారిలోనే మనవడు

Wed Jan 23 2019 20:00:01 GMT+0530 (IST)

దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం సామెత సినిమా పరిశ్రమకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఏ రోజు ఎవరు స్టార్ అవుతారో ఎవరు జీరో ఏ మాత్రం ఊహించలేని పరిస్థితుల్లో భవిష్యత్ అవసరాల కోసం హీరోలు ముందుజాగ్రత్తగా రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం సహజంగా జరిగేదే. శోభన్ బాబు ఇదే విషయం మీద భూముల ద్వారా సంపాదన ఇన్వెస్ట్ చేయడం గురించి తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెబుతూ ఉండేవారు. ఇక నాగేశ్వర్ రావు గారు హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించడం దగ్గర నుంచి నాగార్జున రెస్టారెంట్లు వగైరా బిజినెస్ వెంచర్ల దాకా అందరూ ఇలా భవిష్యత్తు కోసం సెట్ చేసుకున్నవాళ్ళే.అందుకే నాగ చైతన్య కూడా ఇదే దారిలో వెళ్తాను అంటున్నాడట. కొద్దిరోజుల క్రితం స్వంత స్టూడియోలో  ఓ వెంచర్ ను మొదలుపెట్టుకున్న చైతు అక్కడితో ఆగకుండా వైజాగ్ వైపు కూడా ఓ కన్నెసాడట. రియల్ ఎస్టేట్ కు మంచి బూమ్ ఉన్న తరుణంలో వైజాగ్ కు దగ్గరలో లేదా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి ధరల్లో భూములు ఆస్తులు దొరికితే వాటి మీద పెట్టుబడి పెట్టేందుకు ప్లానింగ్ చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఫ్యూచర్ లో వైజాగ్ లో సినిమా స్టూడియోలు వస్తాయన్న ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో చైతు ఇలా ఆలోచిస్తున్నాడన్న మాట.

మజిలి షూటింగ్ అక్కడ జరుగుతున్న సమయంలో చైతుకి ఎవరో సన్నిహితులు ఈ ఆలోచన చెప్పారట. ఎలాగూ సమంతా తన జీవితంలో సగం కాబట్టి ఇద్దరు కలిసి ఇలా ప్లాన్ చేసుకుంటే రేపు పిల్లలు అయ్యాకో లేక వాళ్ళు చేతికి వచ్చాకో ఊహకందని విలువతో ఇవే బంగారు గనులుగా మారతాయి. చైతు అందుకే ఇటీవలి కాలంలో వైజాగ్ టాప్ రియల్టర్లను కలుసుకుని సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఇది చైతు అఫీషియల్ గా చెప్పింది కాదు కాని టాక్ అయితే మహా జోరుగా ఉంది.