Begin typing your search above and press return to search.

అఖిల్ సినిమా టైటిల్ ఇదే.. ఫిక్సయిపోండి

By:  Tupaki Desk   |   20 Aug 2017 9:23 AM GMT
అఖిల్ సినిమా టైటిల్ ఇదే.. ఫిక్సయిపోండి
X
అక్కినేని అఖిల్ కొత్త సినిమా విషయంలో నాగార్జున ప్రమోషనల్ స్ట్రాటజీ అదిరిపోయిందనే చెప్పాలి. ఈ సినిమా టైటిల్ ప్రకటించడానికి ముందు ట్విట్టర్లో ఆయన నడిపిస్తున్న ఆటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నిన్న తాను.. అమల కలిసి నటించిన క్లాసిక్ మూవీ ‘నిర్ణయం’లోని హలో గురూ ప్రేమ కోసమేరా పాట తాలూకు వీడియోను షేర్ చేస్తూ.. అఖిల్ కొత్త సినిమా టైటిల్ ఈ పాటలోనే ఉంది కనుక్కోమంటూ హింట్ ఇచ్చాడు నాగ్. ఇక అంతే.. అక్కినేని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా గెస్సింగ్ గేమ్ లో భాగస్వాములైపోయారు. ‘హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం’ అని.. ‘పౌరుషం’ అని.. ‘హలో గురూ’.. అని ఇలా రకరకాల టైటిళ్లు ప్రచారంలోకి వచ్చేశాయి.

ఐతే ఈ గెస్సింగ్ గేమ్ ను అంతటితో ఆపేయకుండా కొత్త హింట్ ఇచ్చారు. ఈసారి నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్య లైన్లోకి వచ్చాడు. తాను.. సమంత కలిసి నటించిన క్లాసిక్ ‘ఏమాయ చేసావె’లోని ఓసానా పాట వీడియోను షేర్ చేశాడు. అఖిల్ సినిమా టైటిల్ ఈ పాటలో ఉందని చెప్పాడు. ఈ వీడియో కూడా చూశాక అఖిల్ సినిమా టైటిల్ ఏంటన్నది క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోయింది. ఆ వీడియో ‘హలో’.. ‘హలో’.. అంటూ ముగిసింది కాబట్టి రెండు పాటల్లోనూ కామన్ గా ఉన్న పదం ‘హలో’నే కాబట్టి అఖిల్ టైటిలే ఇదే అని తేలిపోయింది. ఇక ఈ టైటిల్ ప్రకటించడం లాంఛనమే అని భావిస్తున్నారంతా. నాగార్జున పుట్టిన రోజు కానుకగా ఆగస్టు 29న ఈ చిత్ర టైటిల్ ప్రకటిస్తూ.. ఫస్ట్ టీజర్ లాంచ్ చేస్తారని సమాచారం.