'మిస్టర్ మజ్ను' పండుగ ముందేనా..?

Thu Nov 08 2018 14:26:18 GMT+0530 (IST)

అక్కినేని అఖిల్ మూడవ సినిమా ‘మిస్టర్ మజ్ను’ విడుదల తేదీ విషయంలో కాస్త గందర గోళ పరిస్థితులు ఉన్నట్లుగా అనిపిస్తుంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ చివర్లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని బావించారు. కాని డిసెంబర్ లో సినిమా విడుదల చేసే అవకాశం లేదని తేలిపోయింది. తాజాగా దీపావళి కానుకగా ‘మిస్టర్ మజ్ను’ చిత్రం పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టర్ లో సినిమా జనవరిలో విడుదల కాబోతున్నట్లుగా ప్రకటించారు. జనవరిలో సంక్రాంతి కానుక గానా లేదంటే రిపబ్లిక్ డే సందర్బంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారా అనే చర్చ జరుగుతుంది.ఈ సమయంలోనే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి వారం లేదా పది రోజుల ముందే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్న కారణంగా పోటీ పడటం మంచిది కాదని అఖిల్ అండ్ టీం భావిస్తున్నారట. ఇక రిపబ్లిక్ డే సందర్బంగా కూడా కూడా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఆ కారణం వల్ల సంక్రాంతి మరియు రిపబ్లిక్ కంటే ముందే అంటే జనవరి మొదటి వారంలోనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

అఖిల్ మొదటి రెండు సినిమాలు నిరాశ పర్చిన విషయం తెల్సిందే. దాంతో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ చిత్రానికి అఖిల్ కమిట్ అయ్యాడు. తొలిప్రేమ వంటి విభిన్నమైన ప్రేమ కథను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ చిత్రంలో కూడా మంచి రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ ను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్ కు జోడీగా ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అఖిల్ కు ఈ చిత్రం మొదటి సక్సెస్ ను తెచ్చి పెడుతుందనే నమ్మకంతో అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారు.