Begin typing your search above and press return to search.

అఖిల్ సినిమా పేరు... సూర్య‌క‌వ‌చం

By:  Tupaki Desk   |   10 Oct 2015 5:30 AM GMT
అఖిల్ సినిమా పేరు... సూర్య‌క‌వ‌చం
X
తొలి సినిమా ఇంకా విడుద‌ల కానే లేదు. అప్పుడే కొత్త సినిమానా? అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు క‌దా! అస‌లు అఖిల్ ఎప్పుడు ఈ సినిమాని ఓకే చేశాడ‌బ్బా? ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు? అనే విషయాలని తెలుసుకొందామ‌న్న కుతూహలం మీలో పెరుగుతోంది క‌దూ! అయితే ఒక్క నిమిషం. అఖిల్ కొత్త సినిమా పేరేమీ కాదిది. `అఖిల్` త‌న పేరుతోనే క‌థానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు క‌దా. ఆ సినిమాని త‌మిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్క‌డ అఖిల్ అనే పేరుతో కాకుండా.... సూర్య‌క‌వ‌చం పేరుతో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. మ‌న నిర్మాత సి.కళ్యాణే త‌మిళ్‌ లో సినిమాని విడుద‌ల చేస్తున్నాడు. తెలుగులో ఎంత గ్రాండ్‌ గా అఖిల్ ఎంట్రీ జ‌రుగుతోందో, త‌మిళ్‌ లో కూడా త‌న త‌న‌యుడు అంతే గ్రాండ్‌ గా ఎంట్రీ కావాల‌నేది నాగార్జున ఆశ‌.

అందుకే క‌ళ్యాణ్ చేతిలో సినిమాని పెట్టాడు. క‌ళ్యాణ్‌ కి చెన్నైలో మంచి సంబంధాలున్నాయి. ద‌క్షిణ భార‌త‌దేశ ఫిల్మ్ చాంబ‌ర్ అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేశాడు. ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మొద‌లుకొని ర‌జ‌నీకాంత్‌ - క‌మ‌ల్‌ హాస‌న్‌ లాంటి స్టార్ ల‌తోనూ మంచి ప‌రిచ‌యాలున్నాయి. వాళ్లంద‌రినీ ఆహ్వానించి త‌మిళంలో అఖిల్ ఆడియో ఫంక్ష‌న్‌ ని గ్రాండ్ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించుకొన్నార‌ట‌. ఎవ‌రొస్తారో ఏంటో తెలియ‌దు కానీ... ర‌జ‌నీకాంత్ మాత్రం అఖిల్ సూర్య‌క‌వ‌చం ఆడియో ఫంక్ష‌న్‌ కి హాజ‌ర‌వుతాన‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం త‌మిళ వెర్ష‌న్ సినిమాకి సంబంధించిన నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. అక్టోబర్ 22న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అఖిల్‌, స‌యేషా సైగ‌ల్ జంట‌గా న‌టించారు. సూర్యుడికే క‌వ‌చంలా మారిన శ‌క్తివంత‌మైన ఓ యువ‌కుడి క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో అఖిల్ డ్యాన్సులు ఇర‌గ‌దీశాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. స‌యేషా కూడా ఆయ‌న‌కి ధీటుగానే డ్యాన్స్ వేసిన‌ట్టు తెలుస్తోంది. ఆమె ప్రొఫెష‌న‌ల్ డ్యాన్స‌ర్ కూడా. లాటిన్ అమెరికాలో ప్ర‌త్యేకంగా త‌ర్ఫీదు పొందింద‌ట‌. మ‌రి ఈ క్యూట్ జంట తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల్ని ఏ స్థాయిలో అల‌రిస్తుందో చూడాలి.