అఖిల్.. యమా స్పీడు గురూ

Tue Jun 12 2018 10:19:19 GMT+0530 (IST)

కమర్షియల్ హీరోగా క్లిక్ అవడానికి కావాల్సిన అన్ని ఫీచర్లు ఉన్నా అక్కినేని హీరో అఖిల్ కు కాలం కలిసి రావడం లేదు. విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్ లో రీసెంట్ గా చేసిన హలో మూవీ బాక్సాఫీస్ ను పెద్దగా మెప్పించలేక పోయింది. ఇందులో అఖిల్ చేసిన స్టంట్స్ కు పేరొచ్చింది కానీ హీరోగా సరైన బ్రేక్ రాలేదు.అందుకే ఈసారి అఖిల్ ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంటర్ టెయినర్ చేస్తున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా తొలిప్రేమ సినిమా తీసి హిట్ కొట్టిన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాకు ప్రస్తుతం మిస్టర్ మజ్ను అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడుతో పూర్తి చేసేలా డైరెక్టర్ ప్లాన్ చేశాడట. షూటింగ్ కోసం సినిమా యూనిట్ మరికొద్ది రోజుల్లో ఫారిన్ కు బయలుదేరనుంది. అక్కడే సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ షూట్ చేయబోతున్నారు. చిన్న చిన్న షెడ్యూల్స్ కాకుండా మేజర్ షెడ్యూల్స్ గా ప్లాన్ చేసి షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేసేలా వెంకీ అట్లూరి సిద్ధమైపోయాడు.

అనుకున్న సమయానికి మొత్తం పూర్తి చేయగలిగితే అఖిల్ మూవీని దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సినిమా యూనిట్ ఆలోచిస్తోంది. అఖిల్ అన్న నాగచైతన్య లేటెస్ట్ మూవీ సవ్యసాచిలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ ఇందులోనూ హీరోయిన్ గా చేస్తోంది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ మూవీకి ప్రొడ్యూసర్.