తండ్రిని పరిచయం చేస్తున్న తనయుడు

Sun Apr 15 2018 17:12:33 GMT+0530 (IST)

పూరి ఆకాష్ హీరోగా రూపొందిన మెహబూబా ట్రైలర్ ఈ మధ్య విడుదలై ఊహించిన దాని కన్నా గొప్ప రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎప్పుడు బ్యాంకాక్ అంటూ మాఫియా కథల చుట్టే ప్రదక్షిణలు చేసే పూరి జగన్నాథ్ కొడుకు కోసం తన రూట్ ని పూర్తిగా మార్చుకుని ఇండో పాక్ నేపధ్యంలో ప్రేమ కథను రాసుకోవడంతో ప్రేక్షకుల్లో దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ట్రైలర్ లో ఆకాష్ పెర్ఫార్మన్స్ చాలా మెచ్యుర్డ్ గా కనిపించడం ఆకట్టుకుంటోంది. దిల్ రాజు కొనేసి రిలీజ్ చేస్తున్నారు అనగానే ట్రేడ్ లో కూడా దీని మీద ఆసక్తి పెరిగిపోయింది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ హీరో పూరి ఆకాశే ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నాడు. అందరూ ఇది తనకు లాంచ్ మూవీ అనుకుంటున్నారని కాని డాడీ మాత్రం తన సహాయంతో ఆయనే లాంచ్ అవుతున్నాను అని చెప్పారని అన్నాడు.నిజానికి పూరికి ఇది రీ లాంచింగ్ మూవీనే. వరస పరాజయాలతో స్టార్ హీరోస్ తనతో చేసేందుకు వెనుకాడే దాకా తెచ్చుకున్న పూరి దీంతో సాలిడ్ హిట్ కొట్టి తానెంతో ఋజువు చేసుకునే పనిలో ఉన్నాడు. అందుకే బడ్జెట్ భారీగా అవుతున్నా లెక్క చేయలేదు. మే 11 విడుదల కానున్న ఈ సినిమాకు బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. చాలా గ్యాప్ తర్వాత సందీప్ చౌతా దీనికి సంగీతం అందించడం కూడా మరో ఆకర్షణ. నిన్నే పెళ్ళాడతా లాంటి ఎవర్ గ్రీన్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సందీప్ చౌతా పూరితో గతంలో సూపర్ సినిమాకు వర్క్ చేసాడు. బాలీవుడ్ వెళ్ళిపోయాక సౌత్ సినిమాలు దాదాపు మానేసిన సందీప్ చౌతా వర్మ సినిమాలకు మాత్రం రెండు మూడింటికి పని చేసాడు. పూర్తి స్థాయి తెలుగు స్ట్రెయిట్ సినిమాకు మాత్రం మెహబూబాతోనే అతను కూడా కం బ్యాక్ ఇస్తున్నాడు.

సో ఇది ఏ రకంగా చూసుకున్నా ముగ్గురికి రీ లాంచ్ అని చెప్పొచ్చు. ఆకాష్ పూరి గతంలో ఆంధ్ర పోరి అనే సినిమాతో పరిచయం అయ్యాడు. కాని అది దారుణంగా పరాజయం పాలైంది. అందుకే దీన్నే ఆకాష్ డెబ్యు మూవీగా ప్రమోట్ చేస్తున్నాడు పూరి. హీరో-దర్శకుడు-సంగీత దర్శకుడు ఇలా ముగ్గురికి ఛాలెంజ్ గా మారిన మెహబూబాలో అంచనాలు కనక నిలబెట్టుకుంటే అందరూ ఫాంలోకి వచ్చేసినట్టే.