టాలీవుడ్ పై గట్టిగా కన్నేశాడట

Mon Jul 17 2017 13:41:37 GMT+0530 (IST)

హీరో అజిత్ కు తమిళంలో తిరుగులేని ఇమేజ్ ఉంది. అభిమానులు ముద్దుగా తల అని పిలుచుకునే అజిత్ తెలుగు వారికి సుపరిచితుడే. అతడు నటించిన ప్రేమలేఖ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అప్పటి నుంచి అతడి సినిమాలు ఆల్ మోస్ట్ తెలుగులో డబ్ చేస్తూనే ఉన్నారు. వాటిలో ఏవీ బ్రహ్మాండమైన హిట్లు కాకపోయినా అతడిని తెలుగు ప్రేక్షకులు గుర్తు ఉంచుకునేందుకు ఉపయోగపడ్డాయనే చెప్పాలి.

తాజాగా అజిత్ వివేగం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫస్ట్ టైం అజిత్ ఈ సినిమా ద్వారా తెలుగులోనూ మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. శౌర్యం శివ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. హై ఓల్టేజీ యాక్షన్ ఎంటర్ టెయినర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫైట్ సీన్స్ అదిరిపోయేలా చిత్రీకరించారని మేకర్స్ చెబుతున్నారు.  సినిమాలో మూడు ప్రధానమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. బల్గేరియా క్రొయేషియా సైబీరియా స్లొవేనియా ఆస్ట్రియా దేశాల్లోని సరికొత్త లొకేషన్లలో షూటింగ్ చేశారు. ఇందులో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్పై టి.జి.త్యాగరాజన్ ప్రొడ్యూస్ చేసిన వివేగం సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ రూ. 4.5 కోట్లకు విక్రయించారని తెలుస్తోంది. ఈ సినిమాను తమిళంతో సమానంతో తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.  ఆగస్టు 10న వివేగం థియేటర్లకు రానుంది.  ఈ మధ్య కాలంలో తెలుగులో అజిత్ సినిమాలు సోసోగా ఆడటమే తప్ప భారీ హిట్ కొట్టలేదు. వివేగం అతడి కోరిక నెరవేరుస్తుందో లేదో చూడాలి.