Begin typing your search above and press return to search.

కన్ఫమ్.. ఆ సూపర్ స్టార్ మళ్లీ అతడితోనే

By:  Tupaki Desk   |   14 Sep 2017 12:37 PM GMT
కన్ఫమ్.. ఆ సూపర్ స్టార్ మళ్లీ అతడితోనే
X
అజిత్ గత ఐదేళ్లలో నాలుగు సినిమాలు చేశాడు. అందులో మూడు సినిమాలకు ఒకరే డైరెక్టర్. అతనే.. శివ. తెలుగులో ‘శౌర్యం’.. ‘శంఖం’.. ‘దరువు’ లాంటి సినిమాలు చేసి.. తమిళంలో ‘విక్రమార్కుడు’ రీమేక్ ‘సిరుత్తై’ తీసిన శివకు అజిత్ లాంటి పెద్ద హీరో ఒక్కసారి ఛాన్సివ్వడమే ఎక్కువంటే.. అతను ఏకంగా అతడితో మూడు సినిమాలు చేసేశాడు. అందులోనూ అతను చేసిన చివరి నాలుగు సినిమాల్లో మూడు శివవే. అజిత్ మధ్యలో ఒక సినిమా చేశాడు కానీ.. శివ అయితే వరుసగా తన మూడు సినిమాలూ అజిత్ తోనే చేశాడు. అయినా ఈ ఇద్దరికీ ఒకరి మీద ఒకరి ఆసక్తి తగ్గిపోలేదు.

అజిత్-శివ కాంబినేషన్లో లేటెస్టుగా వచ్చిన ‘వివేగం’కు మంచి హైప్ వచ్చినా.. ఓపెనింగ్స్ అదిరిపోయినా.. చివరికి ఈ సినిమా ఫ్లాప్ అనే తేలింది. ఎక్కడా కూడా ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టలేదు. బయ్యర్లకు నష్టాలే మిగిలాయి. అయినప్పటికీ శివపై అజిత్ నమ్మకం పెట్టాడు. అతను ఓకే అంటే వేరే స్టార్ డైరెక్టర్లు చాలామంది సినిమా చేయడానికి రెడీ అవుతారు కానీ.. అజిత్ మాత్రం శివకే మళ్లీ ఓటేయడం విచిత్రమే. అజిత్ అభిమానుల్లో సైతం శివ అంటే మొహం మొత్తేసిన ఫీలింగ్ కలుగుతోంది.

హీరో ఎలివేషన్.. మాస్ అంశాల కలబోతతో సినిమా తీస్తాడు తప్ప.. సరైన కథాకథనాలు ఉండవని.. రొటీన్ సినిమాలు చేస్తాడని అతడిపై ఓ ముద్ర పడిపోయింది. ఈ నేపథ్యంలో అజిత్ వేరే దర్శకుడితో ఒక డిఫరెంట్ మూవీ చేయాల్సిందన్న అభిప్రాయం అభిమానుల్లో కూడా ఉంది. కానీ అజిత్ మాత్రం శివను వదలనంటున్నాడు. అతడితోనే అజిత్ తర్వాతి సినిమా ఉంటుందని తమిళ మీడియా ధ్రువీకరిస్తోంది. ఈ చిత్రం స్పేస్ నేపథ్యంలో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ అంటున్నారు. మరి స్పై థ్రిల్లర్ తేడా కొట్టాక.. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూద్దాం.