ఆరెక్స్ 100 అజయ్ నెక్స్ట్ హీరో ?

Fri Sep 14 2018 18:52:56 GMT+0530 (IST)

అసలు పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై పెట్టుబడికి ఐదు రెట్లు లాభం కళ్లజూసేలా విజయం సాధించిన ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమా గురించి ఇంకా స్పష్టత రాలేదు కానీ లీక్ అయిన సమాచారం మేరకు త్వరలో రామ్ తో చేయబోతున్నట్టు టాక్. స్రవంతి రవి కిషోర్ నిర్మించబోయే ఈ మూవీలో మరో స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉందట. మహానటిలో జెమిని గణేశన్ గా సావిత్రిగారిని ప్రేమలో పడేసిన దుల్కర్ సల్మాన్ కూడా ఇందులో ఉండబోతున్నట్టు మరో అప్ డేట్. దుల్కర్ ఓకే బంగారంతోనే మనవాళ్లకు దగ్గరైనా మహానటితో ఫ్యామిలీ ఆడియెన్స్ లో సైతం మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు రామ్ కాంబోలో దుల్కర్ మూవీ అంటే మంచి క్రేజ్ రావడం ఖాయం. కానీ అజయ్ భూపతి కానీ ఇటు ఈ ఇద్దరి హీరోల నుంచి దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ప్రస్తుతానికి లేదు.ఆరెక్స్ 100 తర్వాత పెద్ద బ్యానర్ల నుంచి భారీ ఆఫర్లు అందుకున్న అజయ్ భూపతి ఫైనల్ గా ఎవరికి లాక్ అయ్యాడు అనే దాని మీద ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇదే నిజమైతే కనక రామ్ కు దుల్కర్ కు మంచి అవకాశం అవుతుంది. ప్రస్తుతం హలో గురు ప్రేమ కోసమే ఫినిషింగ్ లో తలమునకలైన రామ్ వచ్చే నెల మూడో వారం తర్వాతే ఫ్రీ అవుతాడు. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసుకున్నా ప్రమోషన్ కోసం ఎంత లేదన్నా రెండు వారాలకు పైగా గడపాల్సి ఉంటుంది. ఈ లోపు అజయ్ నుంచి కానీ దుల్కర్ నుంచి కానీ ఏదైనా ప్రకటన వచ్చినా ఇది నిజమని నిర్ధారణకు రావొచ్చు. మల్టీ స్టారర్లు టాలీవుడ్ లో ఊపందుకుంటున్న తరుణంలో ఈ కాంబో కూడా నిజమైతే వచ్చే ఏడాది రాబోయే ఐదారు మల్టీ స్టారర్లకు ఇది కూడా తోడవుతుంది.