Begin typing your search above and press return to search.

9 కోట్లిస్తే చిరుతో జోడీ కడుతుందట

By:  Tupaki Desk   |   25 Jun 2017 7:09 AM GMT
9 కోట్లిస్తే చిరుతో జోడీ కడుతుందట
X
ఈ మధ్య టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమైపోతోంది. ఈ ఏడాదే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ విషయంలో ఇబ్బంది తప్పలేదు. ‘ఖైదీ నంబర్ 150’ కోసం చాలామంది హీరోయిన్లను పరిశీలించి చివరికి రామ్ చరణ్ కు జోడీగా నటించిన కాజల్ అగర్వాల్ తో సర్దుకుపోయారు. ఇప్పుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కోసం చిరుకు కథానాయికను సెట్ చేయడం మరింత కష్టమైపోతోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ.. తమిళ భాషల్లోనూ తెరకెక్కబోతోంది. దీంతో అన్ని భాషల్లోనూ ప్రేక్షకులకు పరిచయం ఉన్న.. నేషనల్ అప్పీల్ ఉన్న కథానాయికను ఎంచుకుందామని చూస్తున్నారు.

ఇందుకోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లను ట్రై చేస్తుండగా.. వాళ్లు చెబుతున్న రెమ్యూనరేషన్ ఫిగర్ చూసి దిమ్మదిరిగిపోతోందట నిర్మాత చరణ్ కు. తాజాగా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ ను ఈ సినిమా కోసం అడిగితే.. ఆమె ఏకంగా రూ.9 కోట్ల పారితోషకం డిమాండ్ చేసిందట. ఐశ్వర్య అయితే అన్ని భాషల వాళ్లూ కనెక్టవుతారని.. వయసు పరంగా కూడా చిరుతో బాగా మ్యాచ్ అవుతుందని భావించగా.. పారితోషకం దగ్గర పీఠముడి బిగుసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఐశ్వర్య ఏమైనా డిస్కౌంట్ ఇస్తుందా లేక వీళ్లు వేరే ఆప్షన్ ఏదైనా చూస్తారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు అనుష్క.. నయనతార లాంటి సౌత్ సీనియర్ హీరోయిన్లను కూడా పరిశీలిస్తున్నారు. ఐతే ఈ సినిమాకు ఒకరికి ముగ్గురు కథానాయికల్ని ఎంచుకోవాల్సిన నేపథ్యంలో చరణ్ అండ్ సురేందర్ ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/