ఐష్ గురించి ఒక నిజాన్ని మీరు నమ్మలేరు?

Mon Mar 12 2018 13:13:16 GMT+0530 (IST)

ఇప్పుడీ వార్తను చదివే వారిలో సామాన్యులు నుంచి అసమాన్యులు వరకూ చాలామందే ఉంటారు. అయితే.. చాలామందికి ఈ వార్తను చదివాక నిజమేనా? అన్న సందేహం కలగటం ఖాయం. ఏదో ప్రచారం కోసమో.. గాలిని మూటగట్టినట్లుగా వార్త రాసేసి ఉంటారని అనుకోవచ్చు. కానీ.. ఇప్పుడు చెబుతున్న వివరాలు నిజంగా నిజం.ఇంతకూ అంత బలంగా నొక్కి వక్కాణించాల్సిన అవసరం ఏముందంటారా?  కారణం లేకపోలేదు. మొదటే చెప్పినట్లుగా.. ఈ వార్తను చదువుతున్న వారికో ప్రశ్న. మీలో ఎంతమంది మీ పిల్లల్ని రోజూ (కనీసం వారంలో మూడు రోజులు) స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు?  ఎందుకంత శ్రమ.. స్కూల్ బస్సు ఉంది కదా? అని చాలామంది అనుకోవచ్చు. కానీ.. సీనియర్ బాలీవుడ్ నటి.. కోట్లాది మందికి అరాధ్య దేవత  ఐశ్వర్యరాయ్ మాత్రం అలా అనుకోవటం లేదు. తన కుమార్తె ఆరాధ్య చదువుతున్న స్కూల్ కు ఆమె రోజు వెళ్లి వస్తారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు.

ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు పంచుకున్న ఐశ్వర్య.. అందరి మాదిరి తాను సాధారణ తల్లిగానే ఉంటానని చెప్పారు. ప్రతిరోజూ ఆరాధ్యతో కలిసి స్కూల్ కు వెళ్లి వస్తుంటానని చెప్పారు. పార్కులకు తీసుకెళ్లటం.. మార్కెట్ కు వెళ్లటం లాంటి సాధారణ పనుల్ని కూడా తాను చేస్తానని చెప్పారు. ఎందుకంటే.. తాను అలా ఉన్నప్పుడు మాత్రమే సాధారణమైనవి ఏమిటి? అన్నవి అర్థమవుతాయని ఆమె చెబుతున్నారు.

సహజమైనవి.. సోషల్ ఎగ్జైట్ మెంట్ అంటే ఏమిటన్న విషయాన్ని తన కుమార్తెకు తెలియటం కోసం తన వృత్తి జీవితాన్ని ఐష్ కాస్త త్యాగం చేసినట్లుగా చెప్పాలి. తాను 20 ఏళ్ల వయసులో మీడియాను ఎదుర్కోవటం మొదలు పెడితే.. ఆరాధ్య పుట్టినప్పటి నుంచి ఎదుర్కొంటొందని చెప్పారు. ఇప్పుడామెకు అదంతా సర్వసాధారణమైందా? అన్నది తనకు తెలీదన్నారు. ఐష్ లాంటి స్టార్ నటి.. నిత్యం ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో తెలిసిందే. అయినప్పటికీ తన కుమార్తె కోసం ఆమె కేటాయించే సమయం చూసినప్పుడు.. తప్పనిసరిగా పిల్లల కోసం ఎంతోకొంత టైంను కేటాయించాల్సిన అవసరం ఉందనిపించక మానదు. నిజానికి ఈ విషయాన్ని ఐష్ చెప్పాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులుగా అందరి బాధ్యత.