‘స్పైడర్’ రికార్డును బద్దలు కొట్టేస్తుందా?

Sat Jan 13 2018 17:58:06 GMT+0530 (IST)

మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ‘స్పైడర్’ సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు నెలకొల్పుతుందనుకున్నారంతా. కానీ ఆ చిత్రం నష్టాల విషయంలో కొత్త రికార్డులు నెలకొల్పింది. దాదాపు రూ.50 కోట్ల దాకా ఈ చిత్రం నష్టాలు తెచ్చిపెట్టినట్లు అంచనా. దక్షిణాదిన మరే సినిమా కూడా ఈ స్థాయిలో లాస్ మిగల్చలేదని ట్రేడ్ పండిట్లు అన్నారు. ఈ రికార్డు ఇప్పుడిప్పుడే బద్దలు కాదని భావించారు. కానీ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అజ్ఞాతవాసి’ ఆ రికార్డును బద్దలు కొట్టినా ఆశ్చర్యం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.‘అజ్ఞాతవాసి’కి ఏకంగా రూ.125 కోట్ల బిజినెస్ జరిగింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే పెట్టుబడి సునాయాసంగా వసూలైపోయేది. నాన్-బాహుబలి రికార్డులన్నీ బద్దలైపోయేవి. రూ.150 కోట్ల షేర్ మార్కును కూడా అందుకునేదేమో సినిమా. కానీ ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ వచ్చింది. తొలి రోజు రూ.40 కోట్ల షేర్ తో నాన్-బాహుబలి రికార్డు నెలకొల్పినప్పటికీ.. తర్వాతి రోజు నుంచి ‘అజ్ఞాతవాసి’ వసూళ్లు దారుణంగా పడ్డాయి. ఇప్పటికి సినిమా షేర్  రూ.50 కోట్లకు అటు ఇటుగా ఉందంతే. సంక్రాంతి సెలవులు ఇంకా మూణ్నాలుగు రోజులుంటాయి కానీ.. సినిమా ఏమేరకు పుంజుకుంటుంది అన్నది సందేహమే. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.70 కోట్ల షేర్ మార్కును అందుకున్నా గొప్పే అంటున్నారు. అక్కడికే వసూళ్లు ఆగిపోతే నష్టం రూ.55 కోట్ల దాకా ఉంటుంది. అప్పుడు ‘స్పైడర్’ పేరిట ఉన్న చెత్త రికార్డు ‘అజ్ఞాతవాసి’ సొంతమవుతుంది.