Begin typing your search above and press return to search.

‘అజ్ఞాతవాసి’కి.. ‘జై సింహా’కు తేడా అదే

By:  Tupaki Desk   |   16 Jan 2018 5:30 PM GMT
‘అజ్ఞాతవాసి’కి.. ‘జై సింహా’కు తేడా అదే
X
సంక్రాంతికి ముందుగా భారీ అంచనాల మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’కి పేలవమైన టాక్ వచ్చింది. ఆ తర్వాతి విడుదలైన బాలయ్య సినిమా ‘జై సింహా’కు కూడా టాక్ భిన్నంగా ఏమీ లేదు. ఈ రెండు సినిమాలకూ రేటింగ్స్ కూడా దాదాపు ఒకేలా వచ్చాయి. ఐతే రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్ల.. పోటీ లేకపోవడం వల్ల తొలి రోజు ‘అజ్ఞాతవాసి’కి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి. ‘జై సింహా’కు పోటీ ఉండటం.. హైప్ తక్కువ కావడంతో తొలి రోజు వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. ఐతే ఈ రెండు సినిమాల రెండో రోజు వసూళ్ల కథ మాత్రం మరోలా ఉంది. ‘అజ్ఞాతవాసి’ కలెక్షన్లు ఒకేసారి దారుణంగా పడిపోయాయి. రెండో రోజుకే 80 శాతం డ్రాప్ ఉండటం అనూహ్యం. కానీ ‘జై సింహా’ వసూళ్లు కొంతమేరే తగ్గాయి. ఆ మాత్రం డ్రాప్ ఎలాంటి సినిమాకైనా కామనే. ఈ సినిమా స్టడీగా వసూళ్లు రాబడుతూ సాగిపోతోంది. సంక్రాంతి రోజు కూడా దీనికి మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ ‘అజ్ఞాతవాసి’ ఏ దశలోనూ మెరుగు పడలేదు. పేలవమైన వసూళ్లతో కొనసాగుతోంది.

ఈ వైరుధ్యం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇందుకు కారణాలు లేకపోలేదు. ‘అజ్ఞాతవాసి’ సినిమా ఏ ఒక్క వర్గానికీ నచ్చేలా లేకపోవడం దానికి ఇలాంటి వసూళ్లు రావడానికి ప్రధాన కారణం. ఏదో ఒక అంశమైనా ఆకట్టుకుని. కొన్ని ఆకర్షణలు అయినా కలిసొచ్చి ఉంటే సినిమా ఒక మోస్తరుగా అయినా నడిచేది. ఒక దశ దాటాక ‘అజ్ఞాతవాసి’ మరీ విసిగించేస్తుంది. పైగా దీనిపై ఉన్న అంచనాలకు.. సినిమా ఉన్నదానికి పొంతనే లేదు. ఐతే ‘జై సింహా’ అలా కాదు. ఆ సినిమాపై ముందు నుంచే హైప్ తక్కువ. టీజర్.. ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉండొచ్చని ఆశించారో అలాగే ఉంది అది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసిన ఈ సినిమా.. వాళ్లకు నచ్చే అంశాలతో ఓ మోస్తరుగా మెప్పించింది. క్రిటిక్స్.. క్లాస్ ఆడియన్స్ సినిమా గురించి ఏమనుకున్నా.. మాస్ ప్రేక్షకులకు.. బాలయ్య అభిమానులకు నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి. సంక్రాంతి బరిలో ఉన్న వేరే సినిమా ఏదైనా సూపర్ అన్న టాక్ వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది కానీ.. అలాంటి సినిమా ఏదీ లేకపోవడం ‘జై సింహా’కు కలిసొచ్చింది. ఉన్నంతలో ఇదే బెటర్ అన్న అభిప్రాయంతో ప్రేక్షకులు దీని వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో వసూళ్లు బాగున్నాయి.