Begin typing your search above and press return to search.

గూఢచారి అసలు రహస్యం ఇదే

By:  Tupaki Desk   |   18 Aug 2018 11:36 AM GMT
గూఢచారి అసలు రహస్యం ఇదే
X
ఇటీవలి కాలంలో మీడియం బడ్జెట్ సినిమాలు తీయడం అంటే కాలినడకన ముల్లోకాలు చుట్టేసినంత కష్టంగా మారింది. అందులోనూ స్టార్ సపోర్ట్ లేకుండా కేవలం కంటెంట్ మీద ఆధారపడిన వాటిని పరిమితుల మధ్య తెరకెక్కించడం కత్తి మీద సాములా తయారయ్యింది. అందుకే సక్సెస్ అయ్యాకే వాటి తాలూకు కష్టనష్టాలు ప్రపంచానికి తెలుస్తాయి. ఇప్పుడు గూఢచారి ఈ విషయంలో అందరికి స్ఫూర్తిగా నిలుస్తోంది. నిజానికి దీనికైన బడ్జెట్ తెలుసుకుని అందరు ఆశ్చర్యపోయారు. ఇంత క్వాలిటీతో సినిమా తీయాలంటే కనీసం 30 నుంచి 40 కోట్ల దాకా అవసరమైన పరిస్థితుల్లో ఇంత నేర్పుగా ఎలా తీసారా అనే అనుమానాలకు దర్శకుడు శశికిరణ్ తిక్క క్లారిటీ ఇస్తున్నాడు. యూనిట్ లో ఉన్న ప్రతి ఒక్కరు పరిమితులను గుర్తు పెట్టుకుని తమ సినిమా లాగా భావించి వేరేవాళ్లు చేయాల్సిన పనులు కూడా తమ నెత్తి మీద వేసుకుని చేయటం వల్లే 80 ఉండాల్సిన టీమ్ లో 25 మందే ఉన్నా ఆ లోటు కనిపించకుండా మేనేజ్ చేయటంలో ప్రతి ఒక్కరి కృషి ఏంతో ఉందని చెప్పుకొచ్చాడు.

హీరో అని ఫీల్ కాకుండా అడవి శేష్ ఎలాంటి భేషజాలు లేకూండా కెమెరా మోయటం లాంటి పనులు తనతో కలిసి చేయటం వల్ల మిగిలినవాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకున్నారని గుర్తు చేసారు. రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నప్పుడు తన ఇల్లే విడిదిగా మార్చి హీరో శేష్ తో సహా కెమెరామెన్ ఎడిటర్ లకు వసతి కల్పించానని గుర్తు చేసారు. అంతే కాదు యూనిట్ మెంబెర్స్ కు సెపెరేట్ గా హోటల్ అకామడేషన్ కాకుండా స్థానికంగా ఒక మూడు పడకల సర్వీస్ అపార్టుమెంట్ అద్దెకు తీసుకుని పని కానిచ్చామని చెప్పారు. అంతే కాదు హీరోయిన్ శోభిత ధూళిపాళ తన కాస్ట్యూమ్స్ ని స్వయంగా తెచ్చుకునేదట. అసిస్టెంట్లు సైతం సినిమాకు పనికి వస్తాయని అనిపించే ప్రతి వస్తువును వాళ్ళ ఇళ్లలో నుంచి తెచ్చిచ్చేవారని ఆరకంగా మీరు సినిమాలో చూసే ఇన్ సైడ్ ప్రాపర్టీస్ అన్ని అలా తెచ్చినవే అని చెప్పి ఆశ్చర్యానికి గురి చేసాడు. మొత్తానికి యూనిట్ లో సభ్యులను తగ్గించడం ద్వారా కాస్ట్ సేవింగ్ మొదలుపెట్టిన శశికిరణ్ శేషులు ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే గూఢచారి తక్కువ బడ్జెట్ లో రిచ్ క్వాలిటీతో తెరకెక్కింది. ఇది మిగిలినవాళ్లకు కూడా ఇన్స్పిరేషన్ గా మారితే అంతకంటే కావలసింది ఏముంది.