దర్శకేంద్రుడిని కలిసిన గేమ్ ఓవర్ బ్యూటీ

Wed Jun 12 2019 15:03:15 GMT+0530 (IST)

టాలీవుడ్ కు ఝుమ్మంది నాదంతో పరిచయమైన తాప్సి ఆ తర్వాత వెంకటేష్ రవితేజ లాంటి అగ్ర హీరోల సరసన చేసినా సరైన సక్సెస్ దొరక్క ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోయింది. హిందీలో చేసిన పింక్ అనూహ్యంగా బ్లాక్ బస్టర్ కావడంతో పాటు పేరు ప్రఖ్యాతులు తేవడంతో అక్కడే సెటిలైపోయి మంచి ఆఫర్స్ తో పాటు పెర్ఫార్మన్స్ ను కూడా ప్రూవ్ చేసుకుంటోంది. గత ఏడాది వచ్చిన ముల్క్ తో పాటు ఫిబ్రవరిలో విడుదలైన బదలా తాప్సీకి పాపులారిటీని పెంచాయి.ఇదిలా ఉండగా తన కొత్త సినిమా గేమ్ ఓవర్ ఎల్లుండి రిలీజవుతున్న నేపథ్యంలో మీడియా ప్రమోషన్ లో బిజీగా గడుపుతున్న తాప్సీ దర్శకేంద్రులు కె రాఘవేంద్ర రావు గారిని కలిసింది. ఆయనే మొదటి సినిమా దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఈ భేటికి మాములుగా అయితే ఎలాంటి ప్రత్యేకత లేదు. కానీ ఆ మధ్య సౌత్ సినిమాల్లో తన పొట్ట మీద కొబ్బరి చిప్ప వేయడం గురించి కాస్త వ్యంగ్యంగా కామెంట్లు చేసి సోషల్ మీడియాలో విమర్శలు ఎదురుకున్న తాప్సీ తర్వాత సారీ చెప్పింది కానీ రాఘవేంద్ర రావు గారిని వ్యక్తిగతంగా కలవలేదు.

అందుకే ఇప్పుడీ టాపిక్ హాట్ గా మారింది. మరోసారి క్షమాపణ కోరిందా లేదా ఆయన త్వరలో తీయబోతున్న ముగ్గురు హీరోయిన్లు ముగ్గురు దర్శకులు సినిమాలో ఏదైనా ఆఫర్ కోసం మాట్లాడిందా అనే డౌట్లకు ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది. కేవలం గంటా నలభై నిమిషాలే ఉన్న గేమ్ ఓవర్ హిందీతో పాటు తెలుగు తమిళ్ లో ఒకేరోజు రానుంది. ఇది హిట్ అయితే ఇక్కడ మరిన్ని ఆఫర్స్ ఆశిస్తోంది ఈ రింగు కురుల సుందరి