ఒక్క సినిమా ఎంత మార్పు తెచ్చిందో..

Thu Dec 06 2018 20:00:02 GMT+0530 (IST)

తెలుగు సినీ చరిత్ర లో నంబర్ వన్ కథానాయిక ఎవరంటే మరో మాట లేకుండా సావిత్రి పేరు చెప్పేయొచ్చు. కేవలం స్టార్ ఇమేజ్ అనే కాదు.. నటన పరంగా కూడా ఆమెకు ఎవ్వరూ సమీపంలో నిలవలేరు. తెలుగు అనేంటి.. తమిళంలోనూ ఆమెకే అగ్ర తాంబూలం ఇవ్వాలి. అసలు ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఆమెను అత్యుత్తమ కథానాయిక అనొచ్చు. ఐతే ఇంత గొప్ప నటిని అందరూ మరిచిపోయారు. సినీ పరిశ్రమలో ఎంత గొప్ప స్థాయిని అందుకున్నప్పటికీ వారి వారసులు పరిశ్రమలో ఉంటూ.. లైమ్ లైట్లో కొనసాగితేనే వాళ్ల గొప్పదనం తర్వాతి తరాలకు తెలుస్తుంది. కానీ సావిత్రి వారసులెవ్వరూ సినీ రంగంలో లేకపోవడంతో ఆమెను అందరూ మరిచిపోయారు. సావిత్రి జయంతి.. వర్ధంతి వచ్చినపుడు ఎవ్వరూ ఆమె ను పట్టించుకునేవాళ్లు కాదు.కానీ ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది. గురువారం సావిత్రి జయంతి అనే విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహానటిని మననం చేసుకుంటున్నారు. దీనికంతటికీ కారణం ‘మహానటి’ సినిమానే అనడంలో సందేహం లేదు. పెద్ద గా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. తెలుగు సినీ చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ సినిమాతో సావిత్రి గొప్పదనమేంటో అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఈ తరం వాళ్లు కూడా మహానటి గొప్పదనాన్ని తెలుసుకున్నారు. నటిగానే కాక వ్యక్తిగానూ సావిత్రి స్థాయి ఏంటో అందరికీ అర్థమైంది. ఈ నేపథ్యంలో ఈ సారి సావిత్రి జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళి అర్పిస్తున్నారు. ఒక సినిమా జనాల పై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?