బచ్చన్ తోనైనా లక్ కలిసి వచ్చేనా?

Mon Feb 11 2019 15:35:06 GMT+0530 (IST)

'అలా మొదలైంది' వంటి సూపర్ హిట్ చిత్రంతో సినీ కెరీర్ ను మొదలు పెట్టిన ముద్దుగుమ్మ నిత్యామీనన్ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా హీరోయిన్ గా మాత్రం స్టార్ డంను దక్కించుకోలేక పోయింది. ఇష్క్ తో పాటు ఇంకా రెండు మూడు సినిమాలు ఈమెకు సక్సెస్ లను తెచ్చి పెట్టాయి. కాని కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండి పోయింది. అందుకు ప్రధాన కారణం ఆమె దుడుకు స్వభావం మరియు స్కిన్ షో కు నో చెప్పడం. కేవలం తన నటనతోనే అవకాశాలు తెచ్చుకుంటానని స్కిన్ షో చేయను అంటూ చెబుతూ వస్తున్న కారణంగా ఈమెను ఫిల్మ్ మేకర్స్ దూరం పెడుతున్నారు.సెకండ్ హీరోయిన్ గా లీడ్ క్యారెక్టర్ లో నిత్యా మీనన్ నటిస్తూ వస్తున్న విషయం తెల్సిందే. ఈ సమయంలోనే ఈమె వెబ్ సిరీస్ కు కూడా ఓకే చెప్పింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో నిత్యామీనన్ 'బ్రీత్ : సీజన్ 2' లో నటిస్తోంది. బ్రీత్ సీజన్ 1 మంచి సక్సెస్ అయ్యింది. సీజన్ 1 లో మాధవన్ కీలక పాత్రలో నటించగా సీజన్ 2లో బాలీవుడ్ జూనియర్ బిగ్ బి అభిషేక్ బచ్చన్ నటించేందుకు సిద్దం అయ్యాడు. అభిషేక్ బచ్చన్ కు జోడీగా నిత్యామీనన్ కనిపించబోతుంది.

వీరిద్దరి హైట్ చాలా తేడా ఉంటుంది. దాదాపుగా ఫీట్ కు పైగా అభిషేక్ ఎక్కువ హైట్ ఉంటాడు. అయినా కూడా వీరిద్దరికి కథ రీత్యా సరైన జోడీ అనే ఉద్దేశ్యంతో ఎంపిక చేయడం జరిగిందట. వెబ్ సిరీస్ లలో కనిపించిన వారు వెండి తెరపై అలరిస్తున్న ఈ సమయంలో నిత్యా మీనన్ మరోసారి వెండి తెరపై ఈ చిత్రంతో వెలుగు వెలుగుతాననే నమ్మకంతో ఉంది. మరి ఆమె నమ్మకం నిలుస్తుందా చూడాలి.