`కూలీ నంబర్ -1` రీమేక్ లో స్టార్ కిడ్స్

Thu Apr 25 2019 07:00:01 GMT+0530 (IST)

ఓల్డ్ క్లాసిక్స్ ని రీమేక్ చేయడం ఎంత రిస్కో తెలిసిందే. అయినా కొన్నిటిని సక్సెస్ ఫుల్ గా తెరపైకి తెస్తోంది నవతరం ట్యాలెంట్. బాలీవుడ్ క్రేజీ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ ఇదివరకూ `జుడ్వా 2` లో నటించిన సంగతి తెలిసిందే. సల్మాన్ నటించిన క్లాసిక్ హిట్ `జుడ్వా`కి ఎన్నో మార్పులు చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ప్రస్తుతం మరోసారి అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. ఈసారి స్టార్ కిడ్స్ వరుణ్ ధావన్ - సారా అలీఖాన్ జంటగా `కూలీనంబర్- 1`(1995) చిత్రాన్ని రీమేక్ చేస్తుండడం ఆసక్తికరం.గోవిందా - కరిష్మా జంటగా వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ తెరకెక్కించిన `కూలీనంబర్ 1` అప్పట్లో బంపర్ హిట్. ఈ చిత్రంలో గోవిందా కామెడీ అభిమానుల్ని పీక్స్ లో అలరించింది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఆ సినిమాని మరోసారి హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ``ఇది మక్కీకి మక్కీ రీమేక్ కాదు. కేవలం అడాప్టేషన్ మాత్రమే. ఒరిజినల్ లోని స్క్రీన్ ప్లేని యథాతథంగా చూపిస్తాం. కథలో.. సన్నివేశాల్లో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నాం. గత 15ఏళ్లలో అలాంటి పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాన్ని నేను చూడనేలేదు. ఆ సినిమా స్క్రీన్ ప్లే అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నటిస్తున్నా. డాడ్ (డేవిడ్ ధావన్) దర్శకుడిగా అప్పట్లో గ్రేట్. ఆ సినిమాతో నేను నటించే సినిమాకి పోలికలు పెడతారని తెలుసు. అయినా ఛాలెంజింగ్ గానే తీసుకున్నా`` అని తెలిపాడు. ఇకపోతే తెలుగులో వెంకీ - టబు జంటగా అప్పట్లోనే కూలీ నంబర్1 చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సంగతి తెలిసిందే.

వరుణ్ ధావన్ నటించిన కళాంక్ ఇటీవలే రిలీజై మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ ఆ చిత్రాన్ని నిర్మించారు. తదుపరి శశాంక్ ఖైతాన్ రూపొందిస్తున్న రణ్‌భూమి రెమో డి సౌజా దర్శకత్వం వహిస్తున్న స్ట్రీట్ డ్యాన్సర్ చిత్రాల్లో వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. సారా అలీఖాన్ ప్రస్తుతం లవ్ ఆజ్ కల్ 2లో నటిస్తోంది. ఈ యంగ్ జోడీ కి యువతరంలో ఇప్పటికే అసాధారణ క్రేజు ఉంది. కేదార్ నాథ్ సింబా చిత్రాలతో హిట్లు కొట్టి సారా దూకుడుమీద ఉండడంతో ధావన్ బోయ్ తో ఆఫర్ ని క్రేజీగానే భావిస్తున్నారు తన ఫ్యాన్స్.