`సైరా`పై భరణి సంచలన వ్యాఖ్య

Tue Jun 11 2019 12:17:08 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `సైరా-నరసింహారెడ్డి` టాకీ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు బరిలో ఉంటుందా లేదా? అన్నది అటుంచితే దసరా బరిలో అయినా ఖాయంగా రిలీజవుతుందని మెగాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ 151వ సినిమా ఎలా ఉండబోతోంది?  బాహుబలి తరహాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రికార్డులు సృష్టించబోతోందా? అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది.అందుకు తగ్గట్టే మెగాస్టార్ ఎక్కడా తగ్గలేదని అప్పట్లో రిలీజైన టీజర్ చెప్పింది. ఈ సినిమాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ఇంటర్నేషనల్ స్టాండార్డ్స్ కోసం ప్రయత్నిస్తోంది. నాన్న కోసం అన్ లిమిటెడ్ బడ్జెట్ పెడతానని నిర్మాత రామ్ చరణ్ ప్రకటించడంలోనే అంతరార్థం అందరికీ అర్థమైంది. మెగాబాస్ ఇండస్ట్రీ నంబర్ వన్ ఎప్పటికీ అన్న సంకేతాలిచ్చారు.

అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోంది? అన్నదానికి ఇంతవరకూ చిత్రయూనిట్ నుంచి అయితే సరైన సమాచారం లేదు. ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది అని ఒపీనియన్ కూడా చెప్పిందే లేదు. అందుకే సడెన్ గా సీనియర్ నటుడు తనికెళ్ల భరణి  ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్య టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తనికెళ్ళ భరణి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ .. ఈ సినిమా మెగాభిమానుల అంచనాల్ని మించి ఉంటుందని .. సైరా  సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచుతుందని పొగిడేశారు. ఆలస్యానికి చింతించ వద్దని అభిమానులకు ఆయన సూచించారు. కష్టే ఫలి. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందన్న సామెత ఉంది కదా!.. అది ఖచ్చితంగా ఈ సినిమాలో కనిపిస్తుంది. సైరా సినిమాలో నేను ఓ కొత్త తరహా పాత్రలో నటిస్తున్నా. ఆ అవకాశం నాకు రావడం సంతోషంగా ఉంది. నన్ను తెలుగు ప్రేక్షకులు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నా.. అని భరణి అన్నారు. ఆగష్టులో తాను దర్శకత్వం వహించే సినిమా ప్రారంభమవుతుందని తెలిపారు.