Begin typing your search above and press return to search.

ప్రకాష్ రాజ్.. అనవసరంగా నోటీసు పంపాడా?

By:  Tupaki Desk   |   24 Nov 2017 4:12 AM GMT
ప్రకాష్ రాజ్.. అనవసరంగా నోటీసు పంపాడా?
X
గత కొన్ని నెలల నుంచి సమకాలీన రాజకీయాలపై.. సొసైటీలోని కొన్ని సమస్యలపై కొంచెం తీవ్రంగానే స్పందిస్తున్నాడు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్. ఈ క్రమంలో ఆయన కొందరు రాజకీయ నాయకులకు లక్ష్యంగా కూడా మారుతున్నాడు. గత నెలలో కర్ణాటక భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రతాప్ సింహా అనే ఎంపీ ప్రకాష్ రాజ్‌ ను టార్గెట్ చేశాడు. పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య విషయమై ప్రకాష్ రాజ్.. కేంద్రంలోని నరేంద్ర మోడీపై.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్ లపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. దీనిపై ప్రతాప్ సింహా స్పందిస్తూ.. ‘‘నీ కొడుకు చనిపోయి బాధలో ఉన్నపుడు నీ భార్యను వదిలేసి.. ఒక డ్యాన్సర్ వెనుకబడ్డావు. నీకు మోడీ.. యోగిల గురించి మాట్లాడే అర్హత లేదు’’ అని ట్వీట్ చేశాడు.

ఐతే గత నెలలో ప్రతాప్ ఈ ట్వీట్ చేస్తే.. ప్రకాష్ రాజ్ ఇప్పుడు అతడికి లీగల్ నోటీసు పంపించాడు. తన గురించి దారుణంగా మాట్లాడి వ్యక్తిగత జీవితంలో అశాంతి రేకెత్తించినందుకు.. న్యాయపరంగా జవాబు ఇవ్వాలని.. లేదంటే చర్యలు తప్పవని ప్రకాష్ రాజ్ అందులో హెచ్చరించాడు. ఐతే సోషల్ మీడియాలో ట్వీట్ల గురించి జనాలు ఒక రోజు గడిచేసరికి మరిచిపోతుంటారు. కాబట్టి ఇలాంటి వాటిని మరీ అంత సీరియస్ గా తీసుకోవాలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓవైపు తాను రాజకీయ నాయకుల మీద విమర్శలు చేస్తున్న ప్రకాష్ రాజ్.. తాను కూడా విమర్శలు వస్తే తీసుకోవాల్సి ఉంటుందని.. దానికి లీగల్ నోటీసుల వరకు వెళ్తే.. తర్వాత అవతలి వాళ్లు కూడా అదే బాట పడితే అప్పుడు ప్రకాష్ రాజే ఇబ్బంది పడతాడని అంటున్నారు. ఇవన్నీ ప్రకాష్ రాజ్ కు తెలియనివి కావు. మరి ఆయనెందుకు తొందరపడ్డారో?