నేను చాలా వయొలెంట్ అంటున్న నటి

Wed Jun 13 2018 07:00:01 GMT+0530 (IST)

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో నటించింది ప్రగతి. నిర్మలమ్మ.. అన్నపూర్ణ.. సుధల తర్వాత తల్లి పాత్రల్లో అంత పాపులర్ అయిన నటి ఆమే. తెలుగుతో పాటు వేరే భాషల్లోనూ ఆమె కొన్ని పాత్రలు చేసి మెప్పించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది ప్రగతి. ఆమె 17 ఏళ్ల వయసులోనే తమిళంలో కథానాయికగా నటించిందట. అప్పటి స్టార్ హీరో భాగ్యరాజాకు జోడీగా ఆమె కనిపించిందట. దాంతో పాటుగా రెండేళ్ల వ్యవధిలో ఏడు సినిమాల్లో కథానాయికగా నటించినట్లు ప్రగతి వెల్లడించింది.కానీ సినిమాలు తనకు సరిపడవేమో అని 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని సెటిలైపోయానని.. ఇంకో ఏడాదికే తల్లిని కూడా అయ్యానని ప్రగతి చెప్పింది. కానీ కొన్నేళ్ల తర్వాత మళ్లీ తనకు సినిమాలపై ఆసక్తి పుట్టిందని.. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో సీరియల్స్ చేయడం మొదలుపెట్టానని.. ఆపై సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ వచ్చాయని.. మళ్లీ బిజీ అయ్యానని ప్రగతి వెల్లడించింది. కాలేజీ రోజుల్లో తాను చాలా వయొలెంటుగా ఉండేదాన్నని ప్రగతి చెప్పింది. అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడినా.. టీజ్ చేసినా సహించలేకపోయేదాన్నని.. అక్కడికక్కడ అబ్బాయిల్ని పట్టుకుని కొట్టేసేదాన్నని.. దీంతో తనకు ‘రౌడీ గంగమ్మ’ అనే పేరు వచ్చిందని ప్రగతి వెల్లడించింది. నాలుక మడతపెట్టి.. వేలు చూపిస్తూ అబ్బాయిల్ని బెదిరించేదాన్ని.. ఒక గ్యాంగ్ కూడా వేసుకుని తిరిగేదాన్నని.. అందుకే తనను చూసి అందరూ భయపడేవాళ్లని ప్రగతి చెప్పింది. కానీ సినిమాల్లో మాత్రం తాను చాలా సాఫ్ట్ క్యారెక్టర్లే చేశానని ప్రగతి చెప్పింది