సినిమాల్లోకి సాహస హీరో కూతురు

Mon Feb 18 2019 13:25:50 GMT+0530 (IST)

ఇప్పుడు కనిపించడం మానేశారు కానీ 90వ దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా సుపరిచితమైన పేరు అరుణ్ పాండ్యన్. తెలుగులో ఇతని డబ్బింగ్ సినిమాలు చాలానే ఆడాయి. అందులో ఎక్కువ పేరు తెచ్చింది మాత్రం సాహస ఘట్టం. యాక్షన్ అడ్వెంచర్ కలగలిసిన ఈ మూవీ ద్వారానే ఇతను మనకూ దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఓ పదేళ్ల పాటు ఇతనివి వరసబెట్టి వచ్చాయి. దాడి లాంటి స్ట్రెయిట్ మూవీస్ కూడా చేసాడు. నితిన్ తేజ కాంబోలో వచ్చిన ధైర్యంలో నెగటివ్ షేడ్స్ లో నటించింది ఇతనే.ఇప్పుడు ఈయన కూతురు హీరోయిన్ గా తెరంగేట్రం చేయబోతోంది. పేరు కీర్తి పాండ్యన్. హరీష్ రామ్ అనే కొత్త దర్శకుడు దీన్ని రూపొందించబోతున్నాడు. దర్శన్ అనే వర్ధమాన నటుడు హీరో. సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ తో పాటు వివేక్-మెర్విన్ లు జంటగా సంగీతం అందించబోతున్నారు

నాన్న లాగే కూతురు కూడా అడ్వెంచర్ సినిమాతోనే డెబ్యూ చేస్తోంది. స్వతహాగా సాల్సా బ్యాలే డాన్సర్ అయిన కీర్తి పరిచయం కోసం చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ ఫైనల్ గా ఇది తన టేస్ట్ కు అనుగుణంగా ఉండటంతో ఓకే చేసిందట. ఇది తెలుగులో కూడా డబ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అరుణ్ పాండియన్ కూడా నటిస్తారు అనే టాక్ ఉంది.

ఇప్పటికే తమిళనాట కమల్ కూతురు శృతి హాసన్ శరత్ కుమార్ తనయ వరలక్ష్మి తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ కీర్తి కూడా వస్తోంది. ఏంటో తెలుగులో మాత్రం స్టార్ల కూతుళ్ళకు అభిమానుల పేరుతో సంకెళ్లు వేస్తున్నారు. ఇక్కడెప్పుడు మార్పు వస్తుందో