Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘ఆచారి అమెరికా యాత్ర’

By:  Tupaki Desk   |   27 April 2018 12:59 PM GMT
మూవీ రివ్యూ : ‘ఆచారి అమెరికా యాత్ర’
X
చిత్రం : ‘ఆచారి అమెరికా యాత్ర’

నటీనటులు: మంచు విష్ణు - ప్రగ్యా జైశ్వాల్ - బ్రహ్మానందం - పోసాని కృష్ణమురళి - అనూప్ సింగ్ ఠాకూర్ - ప్రదీప్ రావత్ - సుప్రీత్ - పృథ్వీ- కోట శ్రీనివాసరావు - ప్రభాస్ శీను - ప్రవీణ్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సిద్దార్థ్
నిర్మాతలు: కీర్తి చౌదరి - కిట్టు
రచన: మల్లాది వెంకట కృష్ణమూర్తి - డార్లింగ్ స్వామి
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి

దశాబ్దంన్నరగా హీరోగా కొనసాగుతున్న మంచు విష్ణు కెరీర్లో హిట్లు చాలా చాలా తక్కువ. వాటిలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చేసిన సినిమాలే రెండున్నాయి. అవే.. దేనికైనా రెడీ.. ఈడోరకం ఆడోరకం. గత ఏడాది అతను ‘లక్కున్నోడు’తో పెద్ద షాక్ తిన్నాడు. దీని తర్వాత మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి నాగేశ్వరరెడ్డినే నమ్ముకున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన మూడో సినమా ‘ఆచారి అమెరికా యాత్ర’ వాయిదాల మీద వాయిదాలు పడి ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం విష్ణుకు ఉపశమనాన్ని అందించేలా ఉందా లేదా చూద్దాం పదండి.

కథ:

కృష్ణమాచారి (మంచు విష్ణు) ఒక పంతులు. అతను తన గురువు అప్పలాచారి (బ్రహ్మానందం)తో కలిసి ఒక ఇంట్లో హోమం చేయించడానికి వెళ్తాడు. అమెరికా నుంచి వచ్చిన ఆ ఇంటి పెద్ద మనవరాలు రేణుక (ప్రగ్యా జైశ్వాల్)ను అతను ఇష్టపడతాడు. కొన్ని పరిణామాల తర్వాత రేణుక కూడా అతడిని ఇష్టపడుతుంది. ఐతే హోమం ముగిసే సమయంలో ఆ ఇంటి పెద్ద హఠాత్తుగా చనిపోతాడు. దీంతో గురుశిష్యులిద్దరూ భయపడి అమెరికాకు వెళ్లిపోతారు. అక్కడ అనుకోకుండా వీళ్లకు రేణుకు తారసపడుతుంది. ఇంతకీ రేణుక తాతయ్య ఎందుకు చనిపోయాడు.. ఆ తర్వాత రేణుక ఎలాంటి ఇబ్బందుల్లో పడింది.. వాటిని పరిష్కరించి ఆమెను కృష్ణమాచారి ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మంచు విష్ణు సినిమాల్లో విజయవంతమైన ‘ఢీ’.. ‘దూసుకెళ్తా’.. ‘దేనికైనా రెడీ’.. ‘ఈడోరకం ఆడోరకం’ కామెడీ ప్రధాన చిత్రాలు. వాటికి వినోదమే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీటిలో తొలి మూడు సినిమాల్లో బ్రహ్మానందం కీలక పాత్రలు చేశాడు. మంచు విష్ణుతో ఆయన కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరూ కలిసి ప్రేక్షకుల్ని బాగానే నవ్వించారు. ఇక పై నాలుగు సినిమాల్లో చివరి రెండూ తీసిన నాగేశ్వరరెడ్డికి కామెడీ డీల్ చేయడంలో సిద్ధహస్థుడిగా పేరుంది. ఈ ముగ్గురూ కలిసి చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ను ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా చెప్పుకున్నారు. ఈ టైటిల్.. దీని ప్రోమోలు చూసినా కూడా ఇది మినిమం గ్యారెంటీ వినోదాన్ని అందిస్తుందన్న భరోసా కలిగింది. కానీ రెండు గంటలా 15 నిమిషాల నిడివిలో ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునే నిఖార్సయిన కామెడీ సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇందులో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కామెడీ పేరుతో చేసిన ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు.

‘ఆచారి అమెరికా యాత్ర’ ద్వితీయార్దంలో హీరో హీరోయిన్లు.. మిగతా బ్యాచ్ అంతా కలిసి అమెరికాలో రైల్లో ప్రయాణిస్తుంటుంది. వాళ్లను పృథ్వీ తన ఫ్యామిలీతో కలిసి కలుస్తాడు. ఎక్కడికెళ్తున్నారు అంటే తన తండ్రి ఫొటో బయటికి తీసి ఆయన స్టోరీ చెప్పి అక్కడున్న వాళ్లందరినీ బాగా విసిగిస్తాడు. అతను ఆ కథ చెప్పే తీరు భరించలేక అక్కడున్నవాళ్లందరికీ పారిపోవాలని అనిపిస్తుంది. ఆ సమయానికి ‘ఆచారి అమెరికా యాత్ర’ చూస్తున్న ప్రేక్షకుల పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆరంభం నుంచి ఏదో ఉంటుంది.. ఎక్కడోచోట నవ్విస్తారు.. కామెడీ పండుతుందని ఎదురు చూసి చూసి విసుగెత్తిపోతాం అప్పటికే. పృథ్వీ చెప్పే స్టోరీ తెరమీద ఉన్న పాత్రలే భరించలేకపోతుంటే.. దాన్నుంచి అద్భుతమైన కామెడీ పండిపోతున్నట్లుగా అదే కథను ఒకటికి మూడుసార్లు చెప్పిస్తారు. ఇక ప్రేక్షకుడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేదేముంది?

మంచి టైటిల్.. ఆకర్షణీయమైన పోస్టర్ ఉన్నంతమాత్రాన అందులో విషయం ఉంటుందని ఆశించడం తప్పవుతుందని ‘ఆచారి అమెరికా యాత్ర’ అడుగడుగునా రుజువు చేస్తుంది. ఈ చిత్రానికి అసలు అమెరికా నేపథ్యాన్ని ఎందుకు ఎంచుకున్నారన్నదే అర్థం కాదు. దాని వల్ల సినిమాకు ఏ ప్రత్యేకతా చేకూరలేదు. ఇది పేరుకు మాత్రమే ఆకర్షణ. అమెరికా నేపథ్యంలో నడిచే కథ.. సన్నివేశాలు చాలా పేలవంగా తయారయ్యాయి. హీరో తన గురువుకు అబద్ధం చెప్పి.. అరచేతిలో స్వర్గం చూపించి.. అమెరికాకు తీసుకొస్తాడు. కానీ అక్కడికెళ్తే వ్యవహారం మరోలా ఉంటుంది. నిజానికి వాళ్ల పాట్ల నేపథ్యంలో కామెడీ పండించడానికి మంచి స్కోపే దొరికింది. ఐతే మంచి సందర్భం దొరికితే చక్కగా కామెడీ పండించే నాగేశ్వరరెడ్డి క్లూ లెస్ గా కనిపించాడు. పేలవమైన సన్నివేశాలతో ఆరంభంలోనే బోర్ కొట్టించేశాడు. ఇక మధ్యలో కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి ఇండియా నేపథ్యంలో సాగుతుంది. అక్కడ కూడా చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. హీరోయిన్ని హీరో బట్టల్లేకుండా చూడటం.. ఆ నేపథ్యంలో వచ్చే సీన్లు చూస్తున్నపుడు 90ల రోజుల్లోకి వెళ్లిపోతాం. ఈ కాలం చెల్లిన రొమాంటిక్ ట్రాక్ ఓవైపు.. ఏమాత్రం కామెడీ పండని బ్రహ్మానందం ట్రాక్ మరోవైపు.. రెండూ విసిగించేస్తాయి. కానీ సినిమాలో మిగతా ఎపిసోడ్ల కంటే ఇదే కాస్తంత నయంగా అనిపిస్తుంది.

కేవలం తన తాత అస్థికల్ని దక్కించుకుని కాశీలో కలపడం కోసం హీరోయిన్ విలన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఈ విషయమై సినిమాలో ఎంత వివరణ ఇచ్చినప్పటికీ దాని చుట్టూ మొత్తం ద్వితీయార్ధాన్ని నడపడం అన్నది విడ్డూరమైన విషయం. ద్వితీయార్ధంలో అసలు కథేంటో అర్థమైపోయాక ఇక ముగింపు కోసం ఎదురు చూడటమే మిగులుతుంది. నాగేశ్వరరెడ్డి నిలకడ తప్పకుండా ఒకే లెవెల్లో.. పేలవమైన సన్నివేశాలతో బండి నడిపించడంతో ద్వితీయార్ధం మరింత భారంగా తయారవుతుంది. పతాక సన్నివేశాల గురించి చెప్పడానికి ఏమీ లేదు. కథాకథనాల్లో విషయం లేనపుడు ఎలాంటి కాంబినేషన్ అయితే ఏముంది? గతంలో ఈ కాంబినేషన్లో ఎలాంటి సినిమాలొస్తే ఏముంది? మిగతా విషయాలన్నీ పక్కన పెడితే కనీసం ఈ కాంబో నుంచి ఆశించే మినిమం కామెడీ సినిమాలో లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.

నటీనటులు:

మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పడానికేమీ లేదు. కొత్తగా ఏమీ చేయలేదు. తనకు అలవాటైన తరహాలోనే నటించాడు. అతడి పాత్ర ‘దేనికైనా రెడీ’ని గుర్తుకు తెస్తుంది. కానీ అందులో మాదిరి ఇందులో ఫన్ ఏమీ లేకపోయింది. బ్రహ్మానందం సైతం అంతే. ఇలాంటి పేలవమైన పాత్రలు ఇచ్చి బ్రహ్మి ఫాంలో లేడని.. ఆయన పనైపోయిందని అంటే ఎలా?ఆయన తన వంతుగా ఏదో ప్రయత్నం చేశాడు కానీ.. సరైన సన్నివేశాలు లేక కామెడీ వర్కవుట్ కాలేదు. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ నటన గురించి మట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె గ్లామర్ ఆకట్టుకుంటుంది. సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఇదొకటి అనొచ్చు. విలన్ పాత్రల్లో కనిపించిన అనూప్ సింగ్ ఠాకూర్.. ప్రదీప్ రావత్ బాగా ఇరిటేట్ చేస్తారు. పృథ్వీ.. పోసాని.. ప్రవీణ్.. ప్రభాస్ శీను.. వీళ్లెవ్వరూ కూడా నవ్వించలేకపోయారు.

సాంకేతికవర్గం:

తమన్ పాటలు.. నేపథ్య సంగీతం మామూలుగా అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో వచ్చే ఒక మెలోడీ కొంచెం వినసొంపుగా ఉంది. సిద్దార్థ్ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు ఓకే. అమెరికా నేపథ్యం కాబట్టి సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్లే అనిపిస్తుంది. ఈ కథ గురించి చెప్పడానికేమీ లేదు. కథే చాలా సాదాసీదాగా అనిపిస్తే.. స్క్రీన్ ప్లేలోనూ ఏ విశేషం లేకపోయింది. ‘‘తప్పించుకోవడానికి అది పులి పిల్ల కాదు.. ఆడపిల్ల’’.. సినిమాలో డైలాగులు ఎలా సాగుతాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఏ రకంగానూ మెప్పించలేకపోయాడు. అతను పూర్తిగా ఔట్ ఆఫ్ ఫామ్ అనిపిస్తుంది సినిమా చూస్తుంటే.

చివరగా: ఆచారితో యాత్ర.. మహా కష్టం

రేటింగ్- 1.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre