Begin typing your search above and press return to search.

70 కోట్ల సినిమా.. ఏమవుతుందో?

By:  Tupaki Desk   |   24 Sep 2016 5:30 PM GMT
70 కోట్ల సినిమా.. ఏమవుతుందో?
X
ఎ.ఎల్.విజయ్.. ప్రభుదేవా.. తమన్నా.. సోనూ సూద్.. చాలా ఆసక్తి రేకెత్తించే కాంబినేషన్ ఇది. వీళ్లందరూ కలిసి చేసిన సినిమా ‘అభినేత్రి’. తెలుగుతో పాటు తమిళ.. హిందీ భాషల్లోనూ తెరకెక్కిందీ సినిమా. బడ్జెట్ ఏకంగా రూ.70 కోట్లు. తెలుగులో ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నాడు. తెలుగు వెర్షన్ కోసం ఆయన రూ.20 కోట్ల దాకా పెట్టుబడి పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు. ఐతే విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో పాజిటివ్ బజ్ రావట్లేదు. ట్రైలర్ అదీ చూస్తే ఇంతకుముందు చూసిన కొన్ని సినిమాలే గుర్తుకొస్తున్నాయి. కంటెంట్ రొటీన్ అనిపిస్తోంది. దీనికి తోడు మూడు భాషల్లోనూ గట్టి పోటీ మధ్య సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో అని సందేహాలు కలుగుతున్నాయి.

తెలుగులో దసరాకు ‘అభినేత్రి’తో పాటుగా నాలుగు సినిమాలు వస్తున్నాయి. ‘జాగ్వార్’ సంగతి పక్కనబెట్టేసినా.. మిగతా మూడు సినిమాల నుంచి గట్టి పోటీ ఉంటుంది. ముఖ్యంగా ‘ప్రేమమ్’ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ ‘మనవూరి రామాయణం’ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. సునీల్ సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’ మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. వీటి మధ్య ‘అభినేత్రి’ని ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే. మరి వీటితో పోటీపడి రూ.20 కోట్లకు వసూళ్లు రాబట్టడం అంటే సవాలే. మరోవైపు తమిళంలో దసరాకు శివకార్తికేయన్ సినిమా ‘రెమో’ భారీ అంచనాలతో వస్తోంది. హిందీలో అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ ను హీరోగా పరిచయం చేస్తూ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తీసిన ‘మిర్జియా’ను దసరాకే పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. మొత్తంగా అన్ని భాషల్లోనూ ప్రభుదేవా-తమన్నా సినిమాకు గట్టి పోటీ ఉంది. మరి ఆ పోటీలో బడ్జెట్ రికవరీ ఎంత వరకు సాధ్యమో చూడాలి.