త్రివిక్రమ్ -ఎన్టీఆర్ సినిమాలో అతడి గెస్ట్ రోల్?

Mon Oct 23 2017 15:51:31 GMT+0530 (IST)

హీరోల కొడుకులు చిన్నప్పుడే తెరంగేట్రం చేయడం మామూలే. కృష్ణ కొడుకు మహేష్ బాబు దగ్గర్నుంచి రవితేజ కొడుకు మహాధన్ వరకు ఈ బాటలో సాగిన వాళ్లే. ఇప్పుడు ఈ కోవలోనే మరో హీరో కొడుకు సినీ అరంగేట్రం చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ముద్దుల కొడుకు అభయ్ రామ్ కూడా త్వరలోనే సినిమాలో కనిపిస్తే ఆశ్చర్యం లేదంటున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు సోమవారమే ప్రారంభోత్సవం జరిపిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అభయ్ రామ్ కూడా వచ్చాడు. ఈ కార్యక్రమంలో అతనే హైలైట్ గా నిలిచాడు. అందరి కళ్లూ అతడి మీదే నిలిచాయి.ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. పవన్.. ఎన్టీఆర్ ఒకే వేడుకలో కనిపించడమే ఆసక్తి రేకెత్తించేదంటే.. అభయ్ రామ్ సందడి కూడా తోడవడంతో ఈ వేడుక ప్రత్యేకంగా నిలిచింది. చాలా చురుగ్గా కనిపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు అభయ్ రామ్. ఈ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్ గా అభయ్ కనిపించే అవకాశముందని.. త్రివిక్రమ్ లాంటి స్టార్ దర్శకుడి చేతుల మీదుగా కొడుకుని వెండితెరకు పరిచయం చేస్తే బాగానే ఉంటుందని భావించి ఎన్టీఆర్ అంగీకరించాడని చెబుతున్నారు. మరి ఈ వార్తలో వాస్తవమెంటో చూడాలి. ఈ చిత్రాన్ని పవన్ మిత్రుడు రాధాకృష్ణ నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.