డిస్ట్రిబ్యూటర్ గా మారనున్న అమీర్ ఖాన్!

Tue Sep 12 2017 17:23:45 GMT+0530 (IST)

బాలీవుడ్ ఖాన్ త్రయంలో మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ స్టైలే వేరు. ఒక పక్క విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే - మరో పక్క నిర్మాతగా - దర్శకుడిగా కూడా రాణిస్తున్నాడు. అదే తరహాలో అమీర్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడట.  అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో  తెరకెక్కుతున్న సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాతో అమీర్ డిస్ట్రిబ్యూటర్ గా మారబోతున్నాడని తెలుస్తోంది. తన బ్యానర్ లోనే ఒక డిస్ట్రిబ్యూషన్ వింగ్ ను అమీర్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూసుకోవడం కోసం డిస్నీలో ఇండియన్ థియాట్రికల్ డిస్ట్రిబ్యూషన్ డివిజన్ హెడ్ గా పనిచేసిన ప్రఖార్ జోషిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన సొంత బ్యానర్ లో లగాన్ - తారే జమీన్ పర్  - పీప్లి లైవ్ - ధోబీ ఘాట్ - ఢిల్లీ బెల్లీ - దంగల్ వంటి పలు సినిమాలు నిర్మించాడు. అదే ఊపులో సినిమా పంపిణీలోకి కూడా ఆమిర్ రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన నిర్ణయాలు - చర్చలు కూడా ఫైనల్ అయ్యాయట. ఈ తరహా పంపిణీ రంగంలో కి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆల్రెడీ ఎంటరయ్యాడు. ఇప్పటికే రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో  పంపిణీ రంగంలో ఉన్నాడు. ఇపుడు అమీర్ కూడా పంపిణీ రంగంలోకి అడుగుపెడితే ఆ ఇద్దరు ఖాన్ ల మధ్య ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా గట్టి పోటీ ఏర్పడుతుందని బాలీవుడ్ విశ్లేషకుల అంచనా.