Begin typing your search above and press return to search.

నో రెమ్యున‌రేష‌న్‌.. ఓన్లీ ప‌ర్సంటేజ్‌

By:  Tupaki Desk   |   10 Aug 2018 4:19 AM GMT
నో రెమ్యున‌రేష‌న్‌.. ఓన్లీ ప‌ర్సంటేజ్‌
X

హీరోలు పారితోషికాలు తీసుకోక‌పోవ‌డం లేటెస్ట్ ట్రెండ్‌. ఇప్పుడంతా వాటాల ప్రాతిప‌దిక‌నే స్టార్ హీరోలు సంత‌కాలు చేస్తున్నారు. టాలీవుడ్‌ లో మెగాస్టార్ చిరంజీవి - బాలీవుడ్‌ లో అమితాబ్ బ‌చ్చ‌న్‌ - కోలీవుడ్‌ లో ర‌జ‌నీకాంత్ ఈ త‌ర‌హాలో త‌మ‌కు తాముగా మార్కెట్ క్రియేట్ చేసుకుని పారితోషికాల‌తో పాటు లాభాల్లో వాటాలు అందుకునేవార‌న్న ప్ర‌చారం ఉండ‌నే ఉంది. అయితే కాల‌క్ర‌మంలో ఒక్కో ప‌రిశ్ర‌మ‌లో డ‌జ‌న్ల కొద్దీ స్టార్లు స‌క్సెస్ రేటుతో పాటు రూటు మార్చి పారితోషికాల‌కు అద‌నంగా వాటాలు అందుకుంటున్నారు.

బాలీవుడ్‌ లో ఖాన్‌ ల త్ర‌యం ఈ త‌ర‌హాలోనే దండుకోవాల్సినంతా దండుకుంటారు. సినిమాకి హీరోనే స‌ర్వ‌స్వం. డ‌బ్బును సృష్టించేది హీరోలే. డ‌బ్బును డిక్టేట్ చేసేది హీరోలే. అస‌లు హీరో లేనిదే ఏదీ లేద‌న్న‌ది వీళ్ల విధానం. అందుకు త‌గ్గ‌ట్టే నిర్మాత‌లు కూడా ఫైనాన్షియ‌ర్లుగా కొన‌సాగేందుకు అభ్యంత‌రం చెప్ప‌రు. వంద‌ల కోట్లు పెట్టుబ‌డులుగా పెట్టి ప్ర‌యోగాలు చేస్తారు. అయితే ముందే పారితోషికం తీసుకుని హీరోలు హిట్టొస్తే లాభాల్లోంచి త‌మ వాటా తాము అందుకుంటున్నారు. అయితే అది 60: 40 రేషియోలో ఉండొచ్చు. లేదూ కొంద‌రు స్టార్ల విష‌యంలో అయితే 80: 20 రేషియోలో కూడా ఉండొచ్చు. లాభాలు ద‌క్కిన‌ప్పుడు గుంజినంతా గుంజేసినా - న‌ష్టాలొచ్చిన‌ప్పుడు కొంద‌రు హీరోలు నిర్మాత‌ల్ని ఆదుకుంటున్నారు. పారితోషికాలు త‌గ్గించుకుని న‌ష్టం త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇక ఖాన్‌ ల త్ర‌యంలో అమీర్‌ ఖాన్ శైలి కూడా ఇదే. సినిమా రిలీజ్ ముందు పైసా కూడా నిర్మాత నుంచి తీసుకోడట‌. ఆ మాట‌ను ఆయ‌న‌గారే చెప్పారు. ``ముందే పారితోషికం అందుకునే అల‌వాటు నాకు లేదు. రిలీజ్ త‌ర్వాత నిర్మాత పూర్తిగా రిక‌వ‌ర్ అయ్యాడు.. ప‌బ్లిసిటీ - అడ్వ‌ర్‌ టైజ్‌ మెంట్లు స‌హా పెట్టిన పెట్టుబ‌డి మొత్తం వ‌చ్చేసింది అన్న త‌ర్వాత‌నే నేను వాటా తీసుకుంటాను. అయితే తీసుకునే ప‌ర్సంటేజీ పెద్ద‌గా ఉంటుందంతే. నా విలువైన‌ స‌మ‌యం.. నా శ్ర‌మ‌ - ఎఫ‌ర్ట్ అంతా ఖ‌ర్చు చేస్తాను కాబ‌ట్టి.. అందుకు నేను తీసుకునే రిస్క్‌ కి త‌గ్గ‌ట్టే వాటా అందుకుంటాను`` అని క్లియ‌ర్‌ క‌ట్‌ గా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టాడు. నిర్మాత‌ల నుంచి మెజారిటీ పార్ట్ అంటే 80: 20 రేషియోలో దండుకునే హీరోగా అమీర్‌ ఖాన్‌ కి ఇడెంటిటీ ఉంది. అంటే 100 కోట్లు లాభం వ‌స్తే - అందులో 80 కోట్లు అమీర్‌ ఖాన్ అకౌంట్ లోకేన‌న్న‌మాట‌!!