Begin typing your search above and press return to search.

13 ఏళ్ల తర్వాత షాక్ తగిలింది

By:  Tupaki Desk   |   11 Nov 2018 8:35 AM GMT
13 ఏళ్ల తర్వాత షాక్ తగిలింది
X
సినిమా తీసేది దర్శకుడు కాబట్టి.. ఆ దర్శకుడికి ఉన్న క్రెడిబిలిటీని బట్టి జనాలు థియేటర్లకు వెళ్లడం మామూలే. ఐతే ఒక హీరో సినిమా చాలా బాగుంటుంది అని కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లడం అరుదుగా జరుగుతుంటుంది. ఆమిర్ ఖాన్ ఇలాంటి అరుదైన హీరో. అతడి మీద ప్రేక్షకులది మామూలు గురి కాదు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని ప్రేక్షకులు పిలుచుకునే ఆమిర్ ఖాన్.. పర్ఫెక్ట్ సినిమాలే తీస్తాడని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు చాలా ఏళ్లుగా. గత రెండు దశాబ్దాల్లో ఆమిర్ ఖాన్ నుంచి వచ్చిన సినిమాలు అతడి మీద ప్రేక్షకుల్లో అలాంటి నమ్మకం పెంచాయి. ఐతే తాజాగా ఆమిర్ నుంచి వచ్చిన సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మాత్రం ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది. తొలి రోజే దారుణమైన టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఏ దశలోనూ పుంజుకోలేదు.

తొలి రోజు ఓపెనింగ్స్ బాగున్నా.. మరుసటి రోజుకు వసూళ్లు పడిపోయాయి. తర్వాత సినిమా పైకే లేవలేదు. ఆమిర్ ఖాన్ కెరీర్ లోనే ఇది అతి పెద్ద డిజాస్టర్‌ గా నిలవడం ఖాయమనిపిస్తోంది. చివరగా 13 ఏళ్ల కిందట ఆమిర్ ఫ్లాప్ రుచి చూశాడు. ‘లగాన్’ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన ‘మంగళ్ సింగ్: ది రైజింగ్’ సినిమా తీవ్ర నిరాశకు గురి చేసింది. అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పట్నుంచి ఆమిర్ జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. కథల ఎంపికలో అప్రమత్తంగా ఉంటున్నాడు. ‘తలాష్’ లాంటి ఒకట్రెండు సినిమాల వసూళ్లు కొంచెం తగ్గాయి కానీ.. ఈ 13 ఏళ్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఆమిర్ సినిమా ఏదీ లేదు. దాదాపుగా ప్రతి సినిమా సక్సెస్ ఫులే. అలాంటి హీరో నుంచి ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కలెక్షన్ల రికార్డులు కొల్లగొడుతుందనుకున్న ఈ చిత్రం డిజాస్టర్ల రికార్డుల్ని తిరగరాస్తోంది.