Begin typing your search above and press return to search.

అమీర్ కొత్త సినిమా.. సీక్రెట్ సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   4 May 2016 4:54 AM GMT
అమీర్ కొత్త సినిమా.. సీక్రెట్ సూపర్ స్టార్
X
రాశి కంటే వాసికి ప్రాధాన్యమిస్తాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. చాలా ఏళ్లుగా అతను ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు. సినిమాలు ఎంచుకోవడంలో.. పూర్తి చేయడంలో.. వాటిని సరిగ్గా ప్రమోట్ చేసి.. పెద్ద హిట్ అయ్యేలా చూడటంలో అమీర్ ప్లానింగే వేరుగా ఉంటుంది. అందుకే గత కొన్నేళ్లలో సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్ లను దాటేసి ఎక్కడికో వెళ్లిపోయాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. 2014 ఆఖర్లో ‘పీకే’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అమీర్.. రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ‘దంగల్’తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ సినిమా కోసం అమీర్ ఎంత కష్టపడుతున్నాడన్నది తెలిసిందే. దీని తర్వాత చేయబోయే సినిమాకు ఇప్పట్నుంచే సన్నాహాలు చేస్తున్నాడు అమీర్.

సీక్రెట్ సూపర్ స్టార్.. ఇదీ అమీర్ చేయబోయే తర్వాతి సినిమా పేరు. ఐతే ఇది అమీర్ పూర్తి స్థాయి హీరోగా నటించే సినిమా కాదట. ‘తారే జమీన్ పర్’ తరహాలో కీలక పాత్ర పోషిస్తాడట అమీర్ ఇందులో. ఓ చిన్న పిల్లాడే ఇందులో ప్రధాన పాత్రధారి అట. అమీర్ దగ్గర చాలా కాలంగా మేనేజర్ గా పని చేస్తున్న అద్వైత్ చందన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అమిత్ త్రివేది సంగీతం అందించబోయే ఈ సినిమాను అమీరే స్వయంగా నిర్మించబోతుండటం విశేషం.

ప్రస్తుతం ఈ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అమీర్ కూడా ఓ హ్యాండ్ వేస్తున్నాడు. దంగల్ విడుదలయ్యే సమయానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ సినిమా కోసం మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా 2017 ద్వితీయార్ధంలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అమీర్.