Begin typing your search above and press return to search.

అమీర్ ఖానే నిజమైన బాహుబలి

By:  Tupaki Desk   |   18 May 2017 6:38 AM GMT
అమీర్ ఖానే నిజమైన బాహుబలి
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాకు దేశవ్యాప్తంగా ఎలాంటి హైప్ వచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారతీయ సినీ చరిత్రలోనే ఏ సినిమా మీద లేనన్ని అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. నార్త్.. సౌత్ అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. దేశవ్యాప్తంగా కనీ వినీ ఎరుగనంత భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచారు. అదనపు షోలు వేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల టికెట్ల రేట్లు పెంచారు. ‘బాహుబలి-2’ ఇండియాలోనే రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం వెనుక ఇంత కథ ఉంది. ‘బాహుబలి-2’లో కథాకథనాల సంగతలా ఉంచితే.. ఇందులోని విజువల్ గ్రాండియర్.. విజువల్ ఎఫెక్ట్స్.. భారీ యుద్ధ సన్నివేశాల కారణంగా ఒక్కసారైనా ఈ సినిమా చూడాలన్న భావన జనాల్లో కలిగింది.

ఐతే అమీర్ ఖాన్ సినిమా ‘దంగల్’లో విజువల్ ఎఫెక్ట్స్ లేవు.. భారీతనం లేదు.. హీరోయిజం లేదు.. అమీర్ ఖాన్ చాలా మామూలుగా వ్యక్తిగా కనిపిస్తాడందులో. కేవలం కథాకథనాలే ఆ సినిమాకు ప్రాణం. ‘బాహుబలి-2’కు ఉన్నట్లు భారీ హంగులేమీ లేవు దానికి. ఇక ఆ సినిమాకు ‘బాహుబలి-2’ స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అంత క్రేజ్ లేదు. నార్త్ ఇండియాలో ఓకే కానీ.. సౌత్ లో ఈ సినిమాను సగటు హిందీ సినిమాల్లాగే రిలీజ్ చేశారు. విదేశాల్లో కూడా ‘బాహుబలి-2’ స్థాయిలో ఏమీ విడుదల కాలేదు. దీనికంత హైపూ లేదు. అమెరికాలో ‘బాహుబలి-2’కు పెంచినట్లు విపరీతంగా రేట్లు పెంచి టికెట్లు అమ్మలేదు. అయినప్పటికీ ‘బాహుబలి-2’కు దీటుగా వసూళ్లతో అదరగొట్టింది ‘దంగల్-2’. ఫస్ట్ రిలీజ్ లోనే దాదాపు రూ.800 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. తాజాగా చైనాలో విడుదలై రూ.300 కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తోంది. అనేక హంగులు.. అదనపు ప్రయోజనాలతో ‘బాహుబలి-2’ రూ.1500 కోట్ల మార్కుకు చేరువవుతుంటే.. అమీర్ సినిమా కేవలం కంటెంట్.. అమీర్ అద్భుత నటనతో వరల్డ్ వైడ్ రూ.1200 కోట్ల మార్కు దిశగా అడుగులు వేస్తుండటం చిన్న విషయం కాదు. మన సినిమా అని కేవలం వసూళ్లను చూసి ‘బాహుబలి’ గురించి మరీ గొప్పగా చెప్పుకుని.. కంటెంట్ తోనే అసాధారణ విజయం సాధించిన ‘దంగల్’ గొప్పదనాన్ని తగ్గించేయడం సరి కాదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/