Begin typing your search above and press return to search.

ఆది.. ఇన్నాళ్ల‌కు ఓ వెరైటీ సినిమా

By:  Tupaki Desk   |   26 Aug 2016 3:30 PM GMT
ఆది.. ఇన్నాళ్ల‌కు ఓ వెరైటీ సినిమా
X
వరుసగా ఒకటి రెండు కాదు.. అరడజను దాకా ఫ్లాపులు తిన్నాడు యువ కథానాయకుడు ఆది. గత సినిమాలతో పోలిస్తే ‘చుట్టాలబ్బాయి’ కొంచెం మెరుగే కానీ.. అది కూడా అతను ఆశించిన ఫలితాన్నయితే ఇవ్వలేదు. ఈ స్థితిలో తర్వాత ఏ సినిమా చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయాడు ఆది. ‘కార్తికేయ’ను కన్నడలో రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ.. తెలుగు పరిశ్రమనైతే వదిలేయలేడు. ఇక్కడ కూడా సినిమా చేయాలి. తనేంటో రుజువు చేసుకోవాలి. ఇలాంటి టైంలో ఆది ఓ తమిళ రీమేక్ లో నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా పేరు.. ఈట్టి. తమిళంలో అధ్వర్వ హీరోగా నటించిన సినిమా ఇది. రవి అరసు అనే కొత్త దర్శకుడు రూపొందించాడు.

‘ఈట్టి’ తెలుగు రీమేక్ గురించి చాన్నాళ్ల నుంచే చర్చ జరుగుతోంది. ముందు అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమాను తెలుగులో తీస్తారన్నారు. తర్వాత నాగచైతన్య పేరు వినిపింంచింది. ఇప్పుడు ఫైనల్ గా ఆది పేరు ఫైనలైజ్ అయిందంటున్నారు. ఒకవేళ ఆది ఈ సినిమాకు కమిటై ఉంటే మాత్రం అది మంచి నిర్ణయమే. ఆది కొత్తదనం.. కథాబలం ఉన్న సినిమాలు చేయకపోవడం వల్లే వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నాయి. ‘ఈట్టి’ అవి రెండూ ఉన్న సినిమా. చిన్న గాయమైనా రక్తం ఆగకపోయే ఓ అరుదైన వ్యాధి ఉన్న కుర్రాడు.. ఆ బలహీనతను అధిగమించి.. అథ్లెట్ గా ఎదగడం.. ఓ పెద్ద సమస్యలో చిక్కుకుని దాన్నుంచి బయటపడటం.. ఇలా సాగుతుంది ‘ఈట్టి’ కథ. ఆది చూడ్డానికి అథ్లెట్ లాగే ఉంటాడు కాబట్టి.. అతడి ఎనర్జీకి ఈ సినిమా బాగానే సరిపోవచ్చు. ‘చుట్టాలబ్బాయి’ నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.