Begin typing your search above and press return to search.

ట్రోలర్లకు మరో సాఫ్ట్ పంచ్ ఇచ్చిన రెహమాన్

By:  Tupaki Desk   |   9 Feb 2019 2:31 PM GMT
ట్రోలర్లకు మరో సాఫ్ట్ పంచ్ ఇచ్చిన రెహమాన్
X
ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ ఈమధ్య ట్రోలింగ్ కు గురైన సంగతి తెలిసిందే. రెహమాన్ ఆస్కార్ గెలిచిన చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ముంబైలో స్పెషల్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి రెహమాన్ తోపాటు ఆయన కుమార్తె ఖతీజా కూడా హాజరైంది. కాకపోతే ఆమె బుర్ఖాలో హాజరవ్వడంతో కొందరు నెటిజనులు రెహమాన్ సంకుచిత స్వభావి అంటూ ట్రోలింగ్ చేశారు. ఆ తర్వాత ఖతీజా తన ఇష్టపూర్వకంగా నే బుర్ఖా ధరించానని.. తన తండ్రి ఒత్తిడి లేదని వివరణ ఇచ్చింది.

మరోవైపు రెహమాన్ కూడా ఆ విషయంపై స్పందిస్తూ తన రెండో కుమార్తె రహీమా.. సతీమణి సైరా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీతో కలిసి బుర్ఖా లేకుండా దిగిన ఫొటోను ట్విటర్ లో ఆయన పోస్ట్ చేశాడు. ఆ ఫోటోకు ఫ్రీడమ్ టూ చూజ్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. దీంతో విమర్శకులకు గట్టిగా బుద్ధి చెప్పారని రెహమాన్ అభిమానులు సంతోషించారు. ఇదిలా ఉంటే ఆ ఎపిసోడ్ తర్వాత రెహమాన్ మరో ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. హలో మ్యాగజైన్ కోసం రెహమాన్ ముగ్గురు పిల్లలు ఖతీజా.. రహీమా.. అమీన్ పోజిచ్చారు. ఇందులో కూడా ఖతీజా బుర్ఖా ధరించి ఉంటే రహీమా.. అమీన్ మోడరన్ దుస్తుల్లో ఉన్నారు.

ఈ ఫోటోతో మరోసారి రెహమాన్ తన కుటుంబం వ్యక్తిగత స్వేచ్చకు ఎంత గౌరవం ఇస్తుందో చెప్పకనే చెప్పాడు. చాలామంది నెటిజనులు రెహమాన్ కు మద్దతుగా నిలుస్తూ ట్రోలర్లకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. రెహమాన్ ట్రోలర్లకు తనదైన స్టైల్లో సాఫ్ట్ పంచ్ ఇచ్చాడంటూ మెచ్చుకున్నారు. ఇకపై ఇలా ట్రోలింగ్ చేయడం మానండి అంటూ వాళ్ళకు బుద్ధి చెప్పారు. ఈ ఫోటోకు ఒక్కరోజులోనే దాదాపుగా మూడు లక్షలకు పైగా లైకులు రావడం విశేషం.