ఆ ఇద్దరి కోసం స్టార్ డైరెక్టర్ నిర్మాణం

Sat Apr 20 2019 23:00:01 GMT+0530 (IST)

సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు మురుగదాస్. మురుగదాస్ సక్సెస్ శాతం చాలా ఎక్కువ. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మురుగదాస్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు అందించబోతున్నాడు. తెలుగులో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న శర్వానంద్ 'జర్నీ' చిత్రం  మురుగదాస్ నిర్మించాడు. ఆ సినిమాకు మురుగదాస్ శిష్యుడు శరవనన్ దర్శకత్వం వహించాడు. ఆ చిత్రం తర్వాత శరవనన్ మళ్లీ సక్సెస్ దక్కించుకోలేక పోయాడు. అయితే శిష్యుడికి మరో విజయాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మరో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.మురుగదాస్ ఒక లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ను రెడీ చేశాడట. ఆ స్క్రిప్ట్ ను శరవనన్ తెరకెక్కించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటించబోతుంది. 'రంగీ' అనే టైటిల్ తో ఈ చిత్రంను రూపొందించబోతున్నారు. షూటింగ్ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. మురుగదాస్ ఈ చిత్రంతో మరోసారి దర్శకుడు శరవరనన్ మరియు త్రిషలకు సక్సెస్ లను ఇస్తాడేమో చూడాలి. దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయితగా మరియు నిర్మాతగా కూడా మురుగదాస్ వరుసగా సక్సెస్ అవుతున్నాడు. అందుకే 'రంగీ' సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను తమిళ సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం త్రిష కెరీర్ ఊగిసలాటలో ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తే మరి కొన్ని సంవత్సరాలు త్రిష సందడి కొనసాగే అవకాశం ఉంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాల టైం నడుస్తున్న ఈ సమయంలో రంగీ తప్పకుండా ఆకట్టుకుంటుందనే అనిపిస్తుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.