Begin typing your search above and press return to search.

డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ తో ఓవర్సీస్ లో యాభై శాతం వసూళ్లు పడిపోయాయా?

By:  Tupaki Desk   |   15 Oct 2019 7:17 AM GMT
డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ తో ఓవర్సీస్ లో యాభై శాతం వసూళ్లు పడిపోయాయా?
X
అమెరికాలో కొత్తగా రిలీజ్ అయిన సినిమా చూడాలంటే ఇరవై నుంచి ఇరవై ఐదు డాలర్ల మొత్తాన్ని చెల్లించాలి టికెట్ కోసం. టికెట్ ఆ స్థాయిలో ఉండటంతో అమెరికాలో తెలుగు సినిమాలకు మంచి కలెక్షన్ల కళ ఉంటుంది. ప్రత్యేకించి గత దశాబ్ద కాలంలో అక్కడ తెలుగు సినిమాలకు భారీగా వసూళ్లు దక్కాయి. చిన్న సినిమాలు అయినా సరే.. మంచి టాక్ తెచ్చుకుంటే అక్కడ భారీ స్థాయి వసూళ్లను రాబడుతూ వచ్చాయి. ఇక పెద్ద సినిమాల హవా గురించి వేరే చెప్పనక్కర్లేదు.

ఇలా యూఎస్ - ఓవర్సీస్ వసూళ్లు తెలుగు సినిమాకు బంగారు బాతులా మారాయి. అయితే గత కొన్నాళ్లుగా అక్కడ తెలుగు సినిమాలకు కలెక్షన్లు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఈ విషయం వివిధ సినిమాల వసూళ్లతో స్పష్టం అవుతూ ఉంది. అందుకు కారణం గురించి విశ్లేషించే పనిలో పడ్డారు విశ్లేషకులు.

ఆ విషయంలో ప్రధానంగా వినిపిస్తున్న కంప్లైంట్.. డిజిటల్ ప్లాట్ ఫారమ్స్. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ లో అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ వంటి యాప్స్ బాగా పాపులర్ అయ్యాయని వేరే చెప్పనక్కర్లేదు. వివిధ వెబ్ సీరిస్ లను ప్రేక్షకులకు అందిస్తూ - అలాగే సినిమాలను కూడా అందిస్తూ అవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

భారీ మొత్తాలను వెచ్చించి ఆ అప్లికేషన్లు వివిధ సినిమాలను కొనుగోలు చేస్తూ ఉన్నాయి. తమ ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో వాటిల్లో కూడా పోటీ తత్వం పెరిగి.. సినిమా విడుదల అయిన రెండు వారాలకే మొబైల్ లో కూడా విడుదల చేస్తున్నాయి.

ఇది ప్రేక్షకులకు అర్థమవుతూ ఉంది. అందుకే వారు థియేటర్లకు వెళ్లడం బాగా తగ్గిపోతోందని సమాచారం. ఇరవై, ముప్పై డాలర్లు ఖర్చు పెట్టి టికెట్ కొని ప్రత్యేకంగా సమయం వెచ్చించి సినిమాకు వెళ్లడం కన్నా - రెండు వారాలు ఆగితే.. అవే సినిమాలను స్మార్ట్ ఫోన్ లో - కంప్యూటర్ లో వీలైన సమయంలో చూడటానికి అవకాశం ఉంటుంది.

అందుకే ఎన్ ఆర్ ఐలు సినిమా థియేటర్లకు వెళ్లడం బాగా తగ్గిపోయిందని తెలుస్తోంది. ఈ ప్రభావంతో ఓవర్సీస్ లో వసూళ్లు బాగా తగ్గుముఖం పట్టాయని - యాభై శాతం వరకూ తగ్గిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు.