నాలుగు దశాబ్ధాల మెగా జర్నీ

Sat Sep 22 2018 10:18:44 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ 85 ఏళ్ల ప్రస్థానంలో సగం ఆయనే. నాలుగు దశాబ్ధాలుగా అలుపెరగని పయనం సాగించిన స్టారాధిస్టార్. రాజకీయాల్లోకి వెళ్లి కొంత గ్యాప్ ఇచ్చినా `ఖైదీనంబర్ 150` చిత్రంతో పునరారంగేట్రం చేసిన తీరు - ఇప్పుడు కెరీర్ 151వ సినిమా `సైరా-నరసింహారెడ్డి`తో ఇండస్ట్రీ బెస్ట్ ఇవ్వాలని తపిస్తున్న తీరు తలవకుండా అభిమానులు ఉండలేరు. మెగా బాస్ కనిపిస్తే చాలు ఫ్యాన్స్ వెర్రెత్తిపోతారు. ఇన్నేళ్లుగా ఇంతటి అభిమానం ఆయనకు తప్ప వేరే ఎవరికైనా చెల్లిందా?సుప్రీం హీరో కాకముందు చిరంజీవి ప్రస్థానం మరువలేనిది. కెరీర్ ఆరంభం విలన్ గా నటించి - అటుపై కృషి - పట్టుదలతో హీరోగా అంచెలంచెలుగా ఎదిగిన తీరును గుర్తు చేసుకుని తీరాలి. మెరుపుతీగలా బ్రేక్ డ్యాన్సులు చేయాలంటే సుప్రీంహీరోనే. నటన - నడక - నడత - డ్యాన్సులు - ఫైట్స్ .. చేసేది ఏదైనా అందులో ఇన్నోవేటివ్ పంథా తప్పనిసరి. కఠోర సాధకుడిగా - ఎంతో పట్టుదలతో ఆ స్థాయిని అందుకున్నారు. సమకాలీన నటులు ఎందరు ఉన్నా.. ఎవరూ అందుకోలేని స్థాయికి చిరు ఎదిగారంటే దానివెనక మొక్కవోని ధీక్ష ఉంది.

22 సెప్టెంబర్ 1978 .. `ప్రాణం ఖరీదు` రిలీజ్ తేదీ. నిజానికి `పునాదిరాళ్లు` తొలిగా ప్రారంభమైనా.. మొదట రిలీజైంది ప్రాణం ఖరీదు. ఈ సినిమా రిలీజై నేటితో 40 సంవత్సరాలు పూర్తయింది. అన్నయ్య కెరీర్ పరంగా 41వ వసంతంలోకి అడుగుపెట్టారు.`ప్రాణం ఖరీదు`లో జయసుధ - రావుగోపాల్ రావ్ - చంద్రమోహన్ లాంటి దిగ్గజాలు నటించారు. ఇదే  సినిమాతో కోట శ్రీనివాసరావు నటుడిగా ఆరంగేట్రం చేశారు. సి.ఎస్.రావు రచన ఆధారంగా కె.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రాంతి కుమార్ నిర్మించారు. నేటితో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ కి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరు నటిస్తున్న `సైరా-నరసింహారెడ్డి` వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది. అటుపైనా వరుసగా సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే.