Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : '24 కిస్సెస్'

By:  Tupaki Desk   |   23 Nov 2018 8:56 AM GMT
మూవీ రివ్యూ : 24 కిస్సెస్
X
చిత్రం : '24 కిస్సెస్'

నటీనటులు: ఆదిత్ అరుణ్ - హెబ్బా పటేల్ - రావు రమేష్ - నరేష్ - అదితి మైకల్ తదితరులు
సంగీతం: జాయ్ బరువా
ఛాయాగ్రహణం: ఉదయ్ గుర్రాల
నిర్మాతలు: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి - సంజయ్ రెడ్డి - అనిల్ పల్లాల
రచన - దర్శకత్వం: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి

‘మిణుగురులు’ లాంటి మంచి సినిమాతో పరిచయమైన దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి. ఐతే ఆ చిత్రం కమర్షియల్ గా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈసారి అతను ‘24 కిస్సెస్’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీ తీశాడు. యువతకు బాగా నచ్చే ప్రోమోలతో ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఆనంద్ (ఆదిత్ అరుణ్) ఒక చిల్డ్రన్ ఫిలిం మేకర్. పౌష్టికాహార లోపంతో అల్లాడుతున్న చిన్నారుల కోసం ఏదైనా చేయాలని తపిస్తుంటాడు. సినిమాల ద్వారా ఈ సమస్య గురించి ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రయత్నిస్తుంటాడు. ఓ వర్క్ షాప్ లో భాగంగా శ్రీ లక్ష్మి (హెబ్బా పటేట్) అనే అమ్మాయి అతడికి పరిచయం అవుతుంది. ఆమె ఆనంద్ ను ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా ఆమెను ఇష్టపడతాడు కానీ అతను ఒక రిలేషన్ షిప్ కు రెడీగా ఉండడు. ఆనంద్ తనను ప్రేమించడం లేదని.. వేరే అమ్మాయిలతోనూ అతడికి సంబంధాలున్నాయని తెలుసుకుని శ్రీలక్ష్మి అతడికి దూరమవుతుంది. మరి ఆనంద్ తిరిగి ఆమెను తన సొంతం చేసుకున్నాడా లేదా.. ఇంతకీ అతడి ఫిలిం కెరీర్ ఏమైంది.. చిన్నారుల కోసం అతనేం చేశాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హీరో హీరోయిన్లు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇద్దరూ శారీరకంగా కూడా ఒక్కటవుతారు. హీరోయిన్ తన ప్రేమను హీరోకు చెబుతుంది. అతనేమో నీది లవ్వో అట్రాక్షనో ఆలోచించుకో అంటాడు. ఆమె ఏమీ హర్టవదు. మళ్లీ అతడితో అలాగే సన్నిహితంగా ఉంటుంది. తర్వాత ఇంకో సందర్భంలో హీరోను.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతుంది. అతను సమాధానం చెప్పడు. ఈసారి హర్టయినట్లే కనిపిస్తుంది. కానీ అతను సారీ చెప్పగానే తిరిగి అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంది. మళ్లీ అతను ఇంకో అమ్మాయితో కనిపించగానే హర్టయినట్లు కనిపిస్తుంది. కానీ తిరిగి అతను మళ్లీ సారీ చెప్పగానే కొన్ని కండిషన్లు పెట్టి అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంది. హీరో తాను ప్రేమిస్తున్నట్లు చెప్పడు.. పెళ్లి చేసుకుంటానని కమిట్మెంట్ ఇవ్వడు. కానీ హీరోయిన్ మాత్రం మళ్లీ మళ్లీ అతడిని మన్నించేస్తూ అతడి చుట్టూనే తిరుగుతుంటుంది. ఇదీ కథానాయిక పాత్ర.

ఇక హీరో గారేమో ఓవైపు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్న చిన్నారుల్ని ఉద్దరించే పనిలో ఉంటూ.. మధ్య మధ్యలో కనిపించిన ప్రతి అమ్మాయితో రొమాన్స్ చేసేస్తుంటాడు. అలాగే హీరోయిన్ తోనూ రొమాన్స్ ఆట ఆడతాడు. ఒకసారేమో ఆమెపై ఉన్నది మోజు మాత్రమే లవ్ కాదంటాడు. తర్వాత లవ్ చేస్తున్నానని క్లారిటీ తెచ్చుకుంటాడు కానీ.. రిలేషన్ షిప్ కు రెడీగా లేనంటాడు. ఇంకోసారేమో.. బయట ఎంతమంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. మనం పెళ్లి చేసుకుని ఇంకో బిడ్డను కని పాపం చేయాలా అంటూ దిమ్మదిరిగిపోయే లాజిక్ తీస్తాడు. ఇదీ హీరో పాత్ర. ఇక సైకియాట్రిస్టుగా మనకు పిచ్చక్కించే రావు రమేష్ పాత్ర గురించి.. తన కూతుర్ని ఒకడు మోసం చేశాడని తెలిసి కూడా ఇంట్లో కామెడీలు చేసే నరేష్ క్యారెక్టర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ పాత్రలన్నీ ఒకెత్తయితే.. ఓవైపు హీరో హీరోయిన్ల మధ్య ముద్దు ముచ్చట్లతో ఒక బి-గ్రేడ్ సినిమా స్థాయిలో రొమాన్స్ చూపిస్తూ.. ఇంకోవైపు చిన్నపిల్లలు-పౌష్టికాహారం అంటూ ఒక సామాజిక సమస్యను ఇలాంటి సినిమాలో డిస్కస్ చేయాలన్న ఆలోచన చేసినందుకు దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టికి దండం పెట్టాల్సిందే.

‘24 కిస్సెస్’ అనే టైటిల్ పెట్టి ముద్దులు.. ఇంటిమేట్ సీన్లతో ప్రోమోలు వదులుతుంటే.. ఇదేదో ‘ఆర్ఎక్స్ 100’ తరహాలో కుర్రకారును ఆకర్షించే ప్రయత్నంలా కనిపించింది. ఐతే ‘మిణుగురులు’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అయోధ్యకుమార్ ఏదో ఒక విషయం లేకుండా సినిమా తీసి ఉండడులే అన్న ఆలోచన కూడా కలిగింది. కానీ ‘24 కిస్సెస్’ చూశాక ఇతనేనా ‘మిణుగురులు’ తీసింది అని ఆశ్చర్యం కలుగుతుంది. కనీసం పూర్తిగా దీన్నొక ఎరోటిక్ మూవీలా తీసి ఉన్నా.. కనీసం కుర్రాళ్లయినా సంతృప్తి చెందేవాళ్లు. కానీ ఇది రెంటికీ చెడ్డ రేవడి అయింది. 24 ముద్దుల కథను చాలా పొయెటిగ్గా చెప్పేస్తున్నట్లు.. ఈ వ్యవహారాన్ని చాలా పరిణతితో డీల్ చేస్తున్నట్లు దర్శకుడు భావించి ఉండొచ్చేమో కానీ.. తెరపై మాత్రం అది చాలా వరకు వల్గర్ గానే కనిపిస్తుంది. ఇటు హీరోలో కానీ.. అటు హీరోయిన్లో కానీ.. ప్రేమ భావనలేమీ ఉండవు. కామం మాత్రమే కనిపిస్తుంది. టేకింగ్ విషయంలో పొయెటిగ్గా ఏదో ట్రై చేశారు కానీ.. ప్రేక్షకులకైతే అలాంటి భావనేమీ కలగదు.

ప్రథమార్ధం వరకు ఈ ముద్దులు.. ఇంటిమేట్ సీన్లతో ఓ వర్గం ప్రేక్షకులైనా సంతృప్తి చెందుతారు. ద్వితీయార్ధంలో అవి కూడా మిస్సవడంతో భరించలేని విధంగా తయారవుతుంది ‘24 కిస్సెస్’. ప్రధాన పాత్రల్లోని గందరగోళం.. ఒక దశా దిశా లేకుండా సాగే కథాకథనాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ఇవన్నీ చాలవన్నట్లు హీరో హీరోయిన్ల స్నేహితులతో.. హీరోయిన్ తమ్ముడితో ‘కామెడీ’ పండించే ప్రయత్నం కూడా చేశారు. అదంతా చూశాక కూడా చివరిదాకా థియేటర్లలో కూర్చోగలిగితే సాహసమే. ఇక సైకియాట్రిస్టుగా రావు రమేష్ కు.. హీరోకు మధ్య సహకార వాయిద్యం తరహాలో కొన్ని సీన్లు పెట్టారు. అవి అయితే హింసకు పరాకాష్ట అన్నట్లే. ఏ పాత్ర ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు.. ఏ సీన్ ఎందుకొస్తుందో తెలియదు.. మొత్తంగా ఒక దశ దాటాక ‘24 కిస్సెస్’ అస్తవ్యస్తంగా.. అయోమయంగా తయారై ప్రేక్షకుడికి నరకం చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో కాస్త పేరున్న చిత్రాల్లో ‘24 కిస్సెస్’ అంత గందరగోళమైన.. అర్థరహితమైన సినిమా మరొకటి రాలేదనడంలో సందేహం లేదు.

నటీనటులు:

‘కథ’.. ‘తుంగభద్ర’ లాంటి సినిమాల్లో తనేంటో రుజువు చేసుకున్న ఆదిత్.. ‘24 కిస్సెస్’లో కూడా బాగానే చేశాడు. అతడిలో ఈజ్ కనిపించింది. కానీ అతడి క్యారెక్టరే గందరగోళంగా ఉంది. హెబ్బా పటేల్ నటన గురించి చెప్పడానికేమీ లేదు. మేకప్ లేకుండా నటించడం వల్ల కొన్ని సన్నివేశాల్లో చాలా డల్లుగా కనిపించింది. ఆమెను ఇంటిమేట్ సీన్లలో చూడటం కుర్రాళ్లను ఆకట్టుకోవచ్చు. రావు రమేష్ చేసిందేమీ లేదు. ఆయన పాత్ర విసిగిస్తుంది. నరేష్ కూడా వృథా అయ్యాడు. మిగతా నటీనటుల గురించి చెప్పడానికేమీ లేదు.

సాంకేతికవర్గం:

టెక్నీషియన్స్ లో సంగీత దర్శకుడు జాయ్ బరువా పర్వాలేదనిపించాడు. ఈ ఉత్సవం నీకో సగం నాకో సగం.. పాట వినడానికి బాగుంది. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తుంది. ఉదయ్ గుర్రాల ఛాయాగ్రహణం మామూలుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పేలవంగా ఉన్నాయి. ఇక దర్శకుడు అయోధ్యకుమార్ గురించి ఏం చెప్పాలి? ‘మిణుగురులు’ తెచ్చుకున్న పేరు మొత్తం ఆయన పోగొట్టుకున్నారు. అర్థరహితమైన కథాకథనాలతో.. చెత్త సన్నివేశాలతో ‘24 కిస్సెస్’ను పేలవంగా తయారు చేశాడు. రచయితగా.. దర్శకుడిగా అయోధ్యకుమార్ పూర్తిగా విఫలమయ్యాడు.

చివరగా: 24 కిస్సెస్.. నాన్ సెన్స్

రేటింగ్-0.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre