ఓపెనింగ్ అదిరింది.. ఇక మెరుపులే

Wed Jan 11 2017 23:00:01 GMT+0530 (IST)

2016 టాలీవుడ్‌కు మరపురాని సంవత్సరం. గత కొన్నేళ్లతో పోలిస్తే నిరుడు సక్సెస్ రేట్ బాగా పెరిగింది. ఇటు పెద్ద సినిమాలు.. అటు చిన్న సినిమాలు మంచి విజయం సాధించాయి. వసూళ్ల వర్షం కురిపించాయి. 2016తో పోలిస్తే ఈ ఏడాది మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది అలాంటి క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి మరి. 2017పై ఉన్న అంచనాలకు తగ్గట్లే ఆరంభం అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ 2017కు అద్భుత ఆరంభాన్నిచ్చింది. ఈ సినిమా వసూళ్లు మామూలుగా లేవు. నాన్ బాహుబలి ఓపెనింగ్ రికార్డులు భారీ తేడాతో బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్య సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’.. శర్వానంద్ మూవీ ‘శతమానం భవతి’ కూడా పాజిటివ్ బజ్ మధ్య రిలీజవుతున్నాయి. ఇవి కూడా కచ్చితంగా ఆడే బాగా ఆడే సినిమాల్లాగే కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది ఇంకా ‘బాహుబలి: ది కంక్లూజన్’.. ‘2.0’ లాంటి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం. ఈ ఏడాదికి సంబంధించి మరో పెద్ద విశేషం ఏంటంటే.. తెలుగులో టాప్ స్టార్స్‌లో చాలామంది ఈ ఏడాది రెండేసి సినిమాలతో పలకరించే అవకాశాలున్నాయి.  మహేష్ బాబు.. మురుగదాస్ - కొరటాల శివ సినిమాల్ని రిలీజ్ చేయబోతుంటే.. పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’తో పాటు త్రివిక్రమ్ సినిమాను కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశముంది. నందమూరి బాలకృష్ణ - అక్కినేని నాగార్జున - విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పాటు అల్లు అర్జున్ - ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్ కూడా రెండేసి సినిమాల టార్గెట్ తో పని చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు అత్యధికంగా రిలీజైన ఏడాదిగా కూడా 2017 రికార్డు నెలకొల్పే అవకాశముంది. ‘ఖైదీ నెంబర్ 150’తో మొదలైన వసూళ్ల పండగ ఈ స్టార్ హీరోలందరి సినిమాలతోనూ కొనసాగి.. టాలీవుడ్ చరిత్రలో 2017 ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఆశిద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/