`ఫోర్బ్స్` లో అక్షయ్ - సల్మాన్!

Tue Jul 17 2018 22:52:19 GMT+0530 (IST)

ప్రస్తుతం బాలీవుడ్ హీరోలలో అక్షయ్ కుమార్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. సెకండ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అక్కీ....స్టార్ హీరోగా అంచెలంచెలుగా ఎదిగాడు. కొంతకాలంగా ఖాన్ త్రయానికి గట్టిపోటీనిస్తూ వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నాడు. విలక్షణ కథలతో పాటు - సామాజిక సందేశం ఉన్న చిత్రాలతో కూడా కమర్షియల్ హిట్ లు సాధిస్తున్నాడు. టాయిలెట్  - ప్యాడ్ మ్యాన్ వంటి సందేశాత్మక చిత్రాలతోనూ బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించవచ్చని ప్రూవ్ చేశాడు. స్టార్ ఇమేజ్ ను పక్కకు పెట్టి....సందేశాత్మక చిత్రాలలో నటిస్తోన్న అక్షయ్...ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకున్నాడు. తాజాగా అక్షయ్ మరో అరుదైన ఘనత దక్కించుకున్నాడు.మంగళవారం నాడు ప్రకటించిన ఫోర్బ్స్-100 జాబితాలో అక్షయ్ 76వ స్థానంలో నిలిచాడు. వరుసగా మూడో ఏడాది అక్షయ్ ...టాప్ -100లో చోటు దక్కించుకోవడం విశేషం. అక్షయ్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్....ఈ జాబితాలో 82వ స్థానంలో నిలిచాడు. 2018కుగానూ ప్రపంచంలోనే అత్యధిక సంపాదన కలిగిన 100 మంది సెలబ్రిటీల జాబితాలో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు.

2018కుగానూ విడుదల చేసిన జాబితాలో అమెరికా బాక్సర్ ఫ్లోయడ్ మేవెదర్ జూనియర్ రూ.1946 కోట్ల ఆదాయంతో అగ్ర స్థానంలో నిలిచాడు. హలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ రెండో స్థానంలో - టీవీ నటుడు కైలీ జెన్నెర్ మూడో స్థానంలో - సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 10వ స్థానంలో ఉన్నారు.

రూ.276 కోట్ల ఆదాయంతో అక్షయ్ కుమార్ 76వ స్థానంలో - రూ.257 కోట్ల ఆదాయంతో సల్మాన్ ఖాన్ 82వ స్థానంలో నిలిచారు. అయితే గత ఏడాది 8వస్థానంలో నిలిచిన షారుక్ ఖాన్....ఈ ఏడాది చోటు దక్కించుకోలేదు. ఈ సందర్భంగా అక్షయ్ పై ఫోర్బ్స్ ప్రశంసల జల్లు కురిపించింది. టాయిలెట్ - ప్యాడ్ మాన్ వంటి సామాజిక కథాంశాలతో తన సామాజిక బాధ్యతను అక్షయ్ చాటుకున్నాడని కితాబిచ్చింది. కాగా జూన్ 1  - 2017 నుంచి జూన్ 1 - 2018వరకు పన్ను చెల్లించక ముందు ఆ సెలబ్రిటీల సంపాదనను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు.