Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: '118'

By:  Tupaki Desk   |   1 March 2019 8:35 AM GMT
మూవీ రివ్యూ: 118
X
చిత్రం : '118'

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్ - నివేథా థామస్ - షాలిని పాండే - ప్రభాస్ శీను - రాజీవ్ కనకాల - భరత్ - నాజర్ - హరితేజ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్
నిర్మాత: మహేష్ కోనేరు
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: కె.వి.గుహన్

ఎక్కువగా మాస్ సినిమాలు చేసే నందమూరి కళ్యాణ్ రామ్ ఈసారి రూటు మార్చి ‘118’ అనే థ్రిల్లర్ మూవీ చేశాడు. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కె.వి.గుహన్ రూపొందించిన చిత్రమిది. ఆసక్తికర ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గౌతమ్ (కళ్యాణ్ రామ్) ఒక టీవీ ఛానెల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. జీవితంలో తనకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకూ సమాధానం రాబట్టాలని ప్రయత్నించే మనస్తత్వం అతడిది. ఒక పెళ్లి వేడుక కోసం ఓ రిసార్టుకు వెళ్లిన అతడికి ఒక విచిత్రమైన కల వస్తుంది. ఆ కలలో కొందరు వ్యక్తులు కలిసి ఓ అమ్మాయిని చంపేస్తుంటారు. కొన్ని నెలల తర్వాత ఆ రిసార్టుకు వెళ్తే మళ్లీ అదే కల అతడిని వెంటాడుతుంది. దీంతో అది మామూలు కల కాదని గౌతమ్ భావిస్తాడు. ఇక దాని మర్మమేంటోో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ గౌతమ్ కలలోకి వచ్చిన అమ్మాయి ఎవరు.. తనకేమైంది.. దాని వెనుక గుట్టును గౌతమ్ ఎలా బయటికి తీశాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

థ్రిల్లర్ సినిమాలకు అత్యంత కీలకమైన విషయం.. తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి రేకెత్తించడం.. ఈ విషయంలో ‘118’ చాలా వరకు విజయవంతం అవుతుంది. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కె.వి.గుహన్ అందరూ వెళ్లే దారిలో వెళ్లకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేశాడు. ప్రేక్షకులకు కొత్త విషయాలు చెప్పి.. భిన్నమైన అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నించాడు. ల్యూసిడ్ డ్రీమింగ్ అనే కొత్త కాన్సెప్ట్ ను అతను మన ప్రేక్షకులకు పరిచయం చేశాడు. మామూలుగా చనిపోయిన వ్యక్తి ఆత్మ మరొకరిలోకి ప్రవేశించి ప్రతీకారాన్ని తీర్చుకోవడం హార్రర్ సినిమాల్లో చూస్తుంటాం. ఐతే ‘118’లో అన్యాయానికి గురైన వ్యక్తికి సంబంధించిన ఉదంతం హీరో కలలోకి రావడం.. ఆ కలను వెంటాడుతూ హీరో ప్రయాణం సాగించడం.. దీనికి సైంటిఫిక్ రీజనింగ్ ఇవ్వడం.. ఇదంతా ‘118’లో కొత్తగా అనిపించే విషయాలు. ఈ కథ ప్రేక్షకుడు అంచనా వేయలేని విధంగా సాగుతుంది. తర్వాత ఏం జరుగుతుందా అన్న ఆసక్తి కూడా రేకెత్తిస్తుంది. కానీ ‘ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్’ ఫీలింగ్ అయితే ఇది ఇవ్వలేకపోయింది.

‘118’కి అతి పెద్ద ప్లస్.. దర్శకుడు కథ నుంచి ఎక్కడా పక్కకు వెళ్లకుండా సూటిగా చెప్పాలనుకున్నది చెప్పడం. వృథాగా అనిపించే ఒక్క సన్నివేశం కూడా సినిమాలో లేదు. హీరోయిన్ తో ఒక రొమాంటిక్ లేదా కమెడియన్ తో ఒక లైట్ మూమెంట్ పెట్టినా కూడా అందులో కథకు సంబంధించి ఏదో ఒక విషయాన్ని చెప్పడానికే ప్రయత్నించాడు దర్శకుడు గుహన్. ఏదో ఒక మసాలా వేద్దాం.. టైంపాస్ చేద్దాం అనే భావన ఎక్కడా కనిపించదు. చిన్న చిన్న సన్నివేశాలు సైతం కథకు ఉపయోగపడేవే. ఈ విషయంలో దర్శకుడి సిన్సియారిటీని అభినందించాలి. సినిమా మొదలైన 15 నిమిషాల్లోపే కథలోకి వెళ్లిపోవడంతో ప్రేక్షకులు కూడా వెంటనే సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు.

ఇక అక్కడి నుంచి సస్పెన్స్ మొదలవుతుంది. హీరో తనకు వచ్చిన కథ తాలూకు మర్మాన్ని కనుగొనే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. ప్రథమార్ధం శరవేగంగా సాగిపోతుంది. ఇంటర్వెల్ మలుపు ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధం మీద క్యూరియాసిటీ పెంచుతుంది. ఐతే క్లూస్ పేరుతో చాలా లింకులు కలపడంతో సినిమా ఒక దశ దాటాక ఒక స్ట్రెయిన్ ఫీలింగ్ కలిగిస్తుంది. మరీ థ్రిల్ అనిపించే మూమెంట్స్ ఏమీ లేకపోవడం సినిమాకు మైనస్ అయింది. అయినప్పటికీ ఫ్లాష్ బ్యాక్ ముందు వరకు సినిమా కొంచెం రేసీగానే సాగుతుంది. ఐతే ప్రిక్లైమాక్స్ దగ్గర ‘118’ గాడి తప్పుతుంది. మొదట్నుంచి ఒక కొత్త తరహా సినిమా చూస్తున్న ఫీలింగ్ ను ఫ్లాష్ బ్యాక్ చెడగొట్టేస్తుంది. ఇక్కడ దర్శకుడు కొత్తగా ఏమీ అనిపించలేదు. నివేథా థామస్ మంచి పెర్ఫామెన్స్ ఇవ్వడం వల్ల ఫ్లాష్ బ్యాక్ లో కొంచెం ఎమోషనల్ టచ్ కనిపించింది కానీ.. ఆ ఎపిసోడ్ మొత్తం మరీ రొటీన్ గా ఉండటంతో నిరాశ తప్పదు.

ముందు నుంచి చూస్తున్న సినిమాలో ఈ ఫ్లాష్ బ్యాక్ అంతగా సింక్ కాలేదు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ‘ల్యూసిడ్ డ్రీమింగ్’ అనే కాన్సెప్ట్ కూడా అంత ప్రభావవంతంగా ఏమీ అనిపించదు. డాక్టర్ గా నాజర్ పాత్రను కొంచెం సిల్లీగా తీర్చిదిద్దడం వల్ల ‘ల్యూసిడ్ డ్రీమింగ్’కు సంబంధించిన సన్నివేశాల్లోనూ సీరియస్నెస్ కొరవడింది. ఒక థ్రిల్లర్ మూవీ నుంచి ఆశించే ముగింపు కూడా ‘118’లో మిస్సయింది. చివర్లో ఏదైనా థ్రిల్లింగ్ మూమెంట్ ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. మొత్తంగా చూస్తే.. కాన్సెప్ట్ పరంగా కొత్తగా అనిపిస్తూ.. కొన్ని థ్రిల్ మూమెంట్స్ తో ‘118’ ఓ మోస్తరుగా ఎంగేజ్ చేస్తుంది. డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని ఒకసారి ట్రై చేయొచ్చు. మరీ ప్రత్యేకమైన అనుభూతిని అయితే ‘118’ కలిగించదు.

నటీనటులు:

కళ్యాణ్ రామ్ పాత్రకు తగ్గట్లుగా నటించాడు. ఎక్కడా హీరోయిజం చూపించకుండా కథతో పాటుగా అతడి పాత్రను నడిపించడం ఆకట్టుకుంటుంది. కళ్యాణ్ రామ్ కూడా ఎక్కడా ఓవర్ ద బోర్డ్ వెెళ్లకుండా సటిల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. అతడి లుక్ బాగుంది. కథకు కీలకమైన సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్ ఎఫెక్టివ్ గా కనిపించాడు. నివేథా థామస్ కు స్క్రీన్ టైం తక్కువే కానీ.. ఆమె బలమైన ముద్ర వేసింది. నటిగా తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. షాలిని పాండే పాత్ర నామమాత్రం. ఆమె ఉన్నంతలో బాగానే చేసింది. ప్రభాస్ శీను.. రాజీవ్ కనకాల.. హరితేజ తదితరులు పాత్రలకు తగ్గట్లు చేశారు. విలన్ గా చేసిన వ్యక్తి గురించి చెప్పడానికేమీ లేదు. కలల గురించి పరిశోధన చేసే డాక్టర్ పాత్రలో నాజర్ అంతగా ఆకట్టుకోలేదు. ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగా లేదు.

సాంకేతికవర్గం:

టెక్నికల్ గా ‘118’ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతం అందించడంలో నేర్పరి అయిన శేఖర్ చంద్ర.. మరోసారి తన పనితనం చూపించాడు. సినిమాలో ఉన్న ఒక్క పాట బాగుంది. ప్రధానంగా బ్యాగ్రౌండ్ స్కోర్ తో శేఖర్ స్కోర్ చేశాడు. దర్శకుడు గుహనే అందించిన ఛాయాగ్రహణం టాప్ క్లాస్ అనిపిస్తుంది. సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో సినిమాటోగ్రఫీ ఒకటి. తన కథకు తగ్గ కెమెరా పనితనంతో ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ఇక దర్శకుడిగానూ గుహన్ పనితనం చూపించాడు. కొత్త కాన్సెప్ట్ ఎంచుకుని దాన్ని చాలా వరకు ఆసక్తికరంగా చెప్పాడు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. కాకపోతే ప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేసే థ్రిల్ మూమెంట్స్ ను అతను స్క్రిప్టులో పొందుపరచలేకపోయాడు. ఫ్లాష్ బ్యాక్ విషయంలో ఏదైనా డిఫరెంటుగా ట్రై చేయాల్సింది. ఓవరాల్ గా దర్శకుడిగా గుహన్ పనితనం ఓకే అనిపిస్తుంది.

చివరగా: జస్ట్ 'ఓకే' థ్రిల్లర్

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre