‘ఉంగరాల రాంబాబు’

Fri Sep 15 2017 GMT+0530 (IST)

‘ఉంగరాల రాంబాబు’

చిత్రం : ‘ఉంగరాల రాంబాబు’

నటీనటులు: సునీల్ - మియా జార్జ్ - ప్రకాష్ రాజ్ - పోసాని కృష్ణమురళి - వెన్నెల కిషోర్ - ఆశిష్ విద్యార్థి - హరితేజ - దువ్వాసి మోహన్ - జబర్దస్త్ వేణు తదితరులు
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి
మాటలు: చంద్రమోహన్ చింతాడ
నిర్మాత: పరుచూరి కిరీటి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: క్రాంతి మాధవ్

కమెడియన్ పాత్రల నుంచి హీరో వేషాలకు మారిన సునీల్.. మొదట్లో మంచి విజయాలే అందుకున్నప్పటికీ తర్వాత దారి తప్పాడు. వరుస ఫ్లాపులతో బాగా వెనుకబడిపోయిన సునీల్.. ‘ఉంగరాల రాంబాబు’ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ‘ఓనమాలు’.. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి మంచి సినిమాలు తీసిన క్రాంతి మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మరి క్రాంతి మాధవ్ అయినా సునీల్ కోరుకున్న విజయాన్నందించాడో లేదో చూద్దాం పదండి.

కథ:

రాంబాబు (సునీల్) వందల కోట్ల ఆస్తికి వారసుడు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన రాంబాబును గారాబంగా పెంచుతాడు అతడి తాతయ్య. ఐతే ఆ తాతయ్య చనిపోగానే ఆయన చేసిన అప్పులకు ఆస్తి మొత్తం చెల్లు అయిపోయి రోడ్డు మీద పడతాడు రాంబాబు. అప్పుడే ఓ బాబాను నమ్ముకుని మళ్లీ ఓ రెండొందల కోట్లకు అధిపతి అవుతాడు రాంబాబు. దీంతో ఆ బాబాను విపరీతంగా నమ్మిన రాంబాబుకు ఉంగరాలు.. జాతకాల పిచ్చి పట్టుకుంటుంది. ఆ సమయంలోనే రాంబాబుకు సావిత్రి (మియా జార్జ్) పరిచయమవుతుంది. జాతకాల పిచ్చితోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు రాంబాబు. సావిత్రి కూడా అతణ్ని ప్రేమించడంతో ఆమె తండ్రిని పెళ్లికి ఒప్పించడానికి వాళ్ల ఊరు వెళ్తాడు రాంబాబు. అక్కడ రాంబాబుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.. వాటిని ఎలా అధిగమించి సావిత్రిని తనదాన్ని చేసుకున్నాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘ఉంగరాల రాంబాబు’ మంచి కామెడీ సినిమా. ఇందులో ప్రతిదీ కామెడీగానే ఉంటుంది. అందులో కొన్నింటి గురించి మాట్లాడుకుందాం. హీరో ఆస్తి మొత్తం పోగొట్టుకుని బాబా దగ్గరికెళ్తే అతను నీ దశ తిరిగిపోతుందంటూ ఓ మొక్క ఇస్తాడు. దాన్ని తీసుకెళ్లి ఓ కొండ ప్రాంతంలో నాటేందుకు ఒక అడుగు గొయ్యి తవ్వితే అక్కడ 200 కోట్ల విలువైన బంగారం దొరికేస్తుంది. ఓ రౌడీ దాచుకోవడానికి బంగారం అక్కడే పాతి పెడతాడు. హీరో సరిగ్గా అక్కడే తవ్వుతాడు. కథ అత్యంత కీలకమైన మలుపు తీసుకునే సన్నివేశం ఇదన్నమాట. ఈ కామెడీకి  పగలబడి నవ్వుకుంటాం.

ఆ తర్వాత ప్రేమకథ.. హీరోని తాను బ్లాక్ మెయిల్ చేసినా..  తననేమీ అనకుండా భయపడి ఉద్యోగం తనకు ఉద్యోగం ఇచ్చాడని హీరోయిన్ ప్రేమలో పడిపోతుంది. అప్పటిదాకా ఆమెను అసహ్యించుకుంటున్న హీరో.. తాను నమ్మిన బాబా చెప్పిన జాతకం హీరోయిన్ దే అని.. ఆమెను చేసుకుంటే తనకు అన్నీ కలిసొచ్చేస్తాయని ఆశపడి సడెన్ గా ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఇద్దరూ దుబాయిలో రౌండు కొట్టి.. ఒక పాట కూడా వేసుకుని గాఢంగా ప్రేమించేసుకుంటారు. మధ్యలో ఏం జరుగుతుందో ఏమో.. హీరో జాతకాల సంగతి వదిలేసి.. హీరోయిన్ కోసం చాలా సినిమాటిగ్గా తన 400 కోట్ల ఆస్తిని రాసిచ్చేయడానికి కూడా రెడీ అయిపోతాడు. ఈ కామెడీకి నవ్వి నవ్వి అలసిపోతాం.

ఇక విలన్ సంగతి సరేసరి. తన 200 కోట్లు కొట్టేసిన వాడు కేరళలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి తన గ్యాంగుని పంపిస్తాడు. వాళ్లు వెళ్లి తాము వెతుకుతున్నవాడి పేరు కూడా అడక్కుండా ఫలానా ఆయన అల్లుడెవరు అని అడిగేసి.. ఇంకొకడిని ఎత్తుకొచ్చేస్తారు. ఆ ఎత్తుకొచ్చినవాడని చిత్ర హింసలు పెడుతుండగా.. వాడి వీపు మీద కమ్యూనిస్టు పార్టీ గుర్తుండటం గమనించి.. ఆ గుర్తు ఉన్న వాళ్లు దేవుడిని... జాతకాల్ని నమ్మరని చాలా తెలివిగాకనిపెట్టేసిన విలన్ స్వయంగా హీరోని పట్టుకోవడానికి కేరళ వెళ్తాడు. అక్కడికెళ్లి హీరో 400 కోట్లను 400 రూపాయల్లా జనాల కోసం రాసిచ్చేయడం చూసేసి ఫిదా అయిపోతాడు. అతణ్ని వదిలేస్తాడు. పతాక సన్నివేశంలో వచ్చే ఈ కామెడీకి పొట్ట చెక్కలైపోతుందంతే.

ఈ సీనేదో బాగున్నట్లుందే అని ఎక్కడైనా ఒక పాజిటివ్ ఫీలింగ్ కొంచెం మొదలవుతుంటే.. ఆ ఫీలింగ్ పోగొట్టేసేలా వెంటనే ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ తో.. సినిమా మొత్తం ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలగడం ‘ఉంగరాల రాంబాబు’ ప్రత్యేకత. మొదట్లోనే  ట్రాక్ తప్పిపోయి.. విసుగు పుట్టించే సన్నివేశాలతో మొదలైన 20 నిమిషాలకే అసహనం కలిగించే ఈ సినిమాను కాసేపటికే మరోలా ఎంజాయ్ చేయడం మొదలుపెడితేనే థియేటర్లో కూర్చోగలం. అంతలా సహనాన్ని పరీక్షిస్తుందీ చిత్రం.

సినిమా మొదలైన అరంగటకే సమయం భారంగా కదులుతూ.. ఓ సన్నివేశాన్ని ఒకసారి చూడటమే కష్టంగా మారుతున్న తరుణంలో.. ఒకే సీన్ మూడుసార్లు చూపించి ఒక ‘సర్ప్రైజ్ ట్రిపుల్ ట్రీట్’ ఇస్తాడు క్రాంతి మాధవ్. ఆ దెబ్బతో సినిమాలో ఇంకేమైనా ఉంటుందేమో అన్న ఆశలకు తెరపడుతుంది. ద్వితీయార్ధంలో కేరళ నేపథ్యంలో సాగే ‘డ్రామా’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కేరల నేపథ్యంలో కథంతా నడిచినా అందరూ అచ్చమైన తెలుగులో మాట్లాడుతుంటారు. కానీ ఊరి పేరు సహా అన్నీ మలయాళంలోనే కనిపిస్తుంటాయి. ఇదంతా అసహజమైన వ్యవహారంలా అనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిజం అంటే ఎవరిలోనూ కదలికి రాదని.. కేరళ నేపథ్యాన్ని ఎంచుకున్నారేమో కానీ.. అది సినిమాకు ఎంతమాత్రం సూటవ్వలేదు. ఈ ఎపిసోడ్ అంతా కూడా చాలా ఔట్ డేటెడ్ గా అనిపిస్తుంది. పైగా కేరళ పేరు చెప్పి చాలా సన్నివేశాల్ని మన దగ్గరేర తీశారు. ఇక ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం.. ద్వితీయార్ధంలో హీరో హీరోయిన్ కుటుంబంలోకి వెళ్లి తనను అసహ్యించుకునే వాళ్లందరి మనసులు గెలిచేయడం.. ఈ ఫార్ములా కూడా చాలా పాతది. ఇలాంటి కథకు ఎలా కనెక్టవుతాం? అసలు హీరో పాత్ర చిత్రణే చాలా చిత్రంగా అనిపిస్తుంది. అతను ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాడో అర్థం కాదు. జాతకాల పిచ్చితో హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు.. ఆ పిచ్చి వదిలేసి ఏకంగా 400 కోట్లు దానమిచ్చేసేంత ఎందుకు మారిపోయాడన్నదానికి రీజన్ లేదు. హీరో హీరోయిన్ల ప్రేమను కూడా ఎక్కడా ఎస్టాబ్లిష్ చేయనపుడు ఇలాంటి సన్నివేశాలతో ఎమోషనల్ కనెక్ట్ ఎలా వస్తుంది? ఇలా చెప్పుకుంటూ పోతే ‘ఉంగరాల రాంబాబు’లో చాలా లోపాలు కనిపిస్తాయి. ఆరంభంలోనే ట్రాక్ తప్పే ఈ సినిమా ఏ దశలోనూ పుంజుకోదు. ఆద్యంతం అదే ‘నిలకడ’తో సాగిపోతుంది.

నటీనటులు:

సునీల్ గురించి చెప్పడానికి ఏముంది..? అతడి కథల ఎంపిక చూసి బాధపడటం తప్ప. సునీల్ హీరోగా కొనసాగొచ్చు. తప్పేమీ లేదు. కానీ అతను తనకు నప్పే ‘అందాల రాముడు’.. ‘మర్యాద రామన్న’ లాంటి సినిమాలు ఎంచుకుంటే బాగుంటుంది. అవి జనాలకు ఎందుకు నచ్చాయో.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఎందుకు తిరస్కారానికి గురవుతున్నాయో తెలుసుకుని తనకు నప్పే సామాన్యుడి పాత్రలు ఎంచుకోవడం మంచిది. గత సినిమాలతో పోలిస్తే హీరోయిజం తగ్గించడం ఓకే కానీ.. తన నుంచి ఆశించే వినోదమైతే ‘ఉంగరాల రాంబాబు’లో ఎంతమాత్రం లేదు.

కొత్త హీరోయిన్ మియా జార్జ్ గురించి చెప్పడానికేం లేదు. అందం విషయంలో కానీ.. నటన విషయంలో కానీ ఆమె ఏమాత్రం ఆకట్టుకోదు. ఆమె పాత్ర కూడా ఎంతమాత్రం ఆసక్తి రేకెత్తించదు. ప్రకాష్ రాజ్ ఇందులో కామ్రేడ్ క్యారెక్టర్ చేశాడు. ఈ పాత్ర... దీని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు చూస్తే.. మూణ్నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో కొంచెం పర్వాలేదనిపించే నటుడెవరైనా ఉన్నారంటే అది వెన్నెల కిషోర్ మాత్రమే. పాత్ర ఎలా ఉన్నప్పటికీ తనదైన టైమింగ్ తో కొంత నవ్వించాడు కిషోర్. పోసాని పెద్దగా చేసిందేమీ లేదు. ఆశిష్ విద్యార్థి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ‘బిగ్ బాస్’ ఫేమ్ హరితేజను ఊరికే అలా విగ్రహంలా నిలబెట్టారు చాలా సన్నివేశాల్లో.

సాంకేతికవర్గం:

ఇలాంటి కంటెంట్ తో టెక్నీషియన్స్ మాత్రం ఏమంత ఎగ్జైట్ అవుతారు? జిబ్రాన్ మ్యూజిక్ సాదాసీదాగా అనిపిస్తుంది. అతడి గత సినిమాలకు దీనికి పోలికే లేదసలు. సర్వేష్ మురారి ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువల విషయంలో ఏమీ రాజీ పడలేదు. డైలాగ్ రైటర్ ప్రాసలతో ఆటాడేసుకున్నారు. అందులో మచ్చుకు ఒకటి.. ‘‘ఇకపై నా ట్రావెల్ బిజినెస్ మీద కాన్సెంట్రేట్ చేయడం మానేసి.. నీతో ట్రావెల్ చేయడం మీద కాన్సెంట్రేట్ చేస్తా’’. ఈ సినిమాకు దర్శకుడి పేరేంటో తెలియకుండా చూసి.. ఇది ‘ఓనమాలు’.. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలు తీసిన క్రాంతి మాధవే చేశాడంటే ఎంతమాత్రం నమ్మలేం. ఆయన ముద్ర ఏ కోశానా కనిపించదు. ఇదీ అదీ అని కాదు.. అన్ని రకాలుగానూ తీవ్ర నిరాశకు గురి చేసే సినిమాను అందించాడు క్రాంతి మాధవ్.

చివరగా: రాంబాబోయ్... నీకో దండం!

రేటింగ్- 1.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS