రంగుల రాట్నం

Sun Jan 14 2018 GMT+0530 (IST)

రంగుల రాట్నం

‘రంగుల రాట్నం’ మూవీ రివ్యూ
నటీనటులు: రాజ్ తరుణ్- చిత్ర శుక్లా-సితార-ప్రియదర్శి తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం: ఎల్.కె.విజయ్
నిర్మాత: అక్కినేని నాగార్జున
రచన-దర్శకత్వం: శ్రీ రంజని

కొన్నేళ్ల నుంచి సంక్రాంతి సీజన్లో పెద్ద సినిమాలకు పోటీగా ఒక చిన్న సినిమా కూడా బరిలో నిలుస్తోంది. మంచి ఫలితం అందుకుంటోంది. ఈ సంక్రాంతికి కూడా అదే తరహాలో ‘రంగుల రాట్నం’ రేసులో నిలిచింది. అక్కినేని నాగార్జున నిర్మాణంలో శ్రీ రంజని అనే కొత్త దర్శకురాలు రూపొందించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్.. చిత్ర శుక్లా జంటగా నటించారు. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: విష్ణు (రాజ్ తరుణ్) చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న కుర్రాడు. అతను దేన్నీ సీరియస్ గా తీసుకోడు. తనకిష్టం వచ్చిన రీతిలో తాను బతుకుతుంటాడు. తండ్రి లేని విష్ణును తల్లి (సితార) అన్నీ తానై పెంచుతుంది. అతడికి పెళ్లి చేసి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలన్న కోరిక ఆమెది. విష్ణు మాత్రం పెళ్లి పట్ల అంత ఆసక్తితో ఉండడు. అలాంటి సమయంలోనే అతడికి కీర్తి (చిత్ర శుక్లా) పరిచయమవుతుంది. ఆమెను విష్ణు ఇష్టపడతాడు. ఆమెది విష్ణుకు పూర్తి భిన్నమైన మనస్తత్వం. ఆమె ప్రతిదీ పద్ధతిగా చేయాలనుకుంటుంది. విష్ణు.. కీర్తికి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉండగానే అతడి జీవితంలో ఒక హఠాత్ పరిణామం జరుగుతుంది. అదేంటి.. దాని తర్వాత విష్ణు జీవితం ఎలా మలుపు తిరిగింది.. కీర్తితో అతడి ప్రేమ సంగతి ఏమైంది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: అక్కినేని నాగార్జున నిర్మాత.. రాజ్ తరుణ్ హీరో.. ఒక కొత్త డైరెక్టర్ అనగానే అందరికీ ‘ఉయ్యాల జంపాల’ గుర్తుకు రావడం సహజం. ‘రంగుల రాట్నం’ ప్రోమోలు చూసినా.. ‘ఉయ్యాల జంపాల’ తరహా ఫ్రెష్ లవ్ స్టోరీ చూడబోతున్నామన్న భావన కలిగింది. కాన్సెప్ట్ వరకు చూసుకుంటే ఇది కూడా తాజాగా అనిపించే సినిమానే. కానీ ఈ కథను ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సరదాగా.. వేగంగా నడిపించడంలో కొత్త దర్శకురాలు శ్రీ రంజని విజయవంతం కాలేకపోయింది. ఏమాత్రం చురుకుదనం లేకుండా కనిపించే హీరోయిన్ పాత్ర తరహాలోనే ఈ సినిమాను కూడా నడిపించడం ప్రతికూలత.

దర్శకురాలు తాను చెప్పాలనుకున్న పాయింట్ ను బాగానే చెప్పింది. ప్రధాన పాత్రల చిత్రణ కూడా బాగుంది. కానీ ఈ కథకు అవసరమైన చురుకుదనమే ఇందులో లేకపోయింది. మెలో డ్రామా కొంచెం ఎక్కువ కావడం వల్ల కావచ్చు.. హీరోయిన్ క్యారెక్టర్ చాలా డల్లుగా ఉండటం వల్ల కావచ్చు.. నత్తనడకన సాగే కథనం వల్ల కావచ్చు.. ‘రంగుల రాట్నం’లో అనుకున్నంత కలర్ ఫుల్ గా లేకపోయింది. కాకపోతే ఇది ఒక మంచి ప్రయత్నమే. తీసిపడేయదగ్గ సినిమా అయితే కాదు. ముఖ్యంగా మిగతా సంక్రాంతి తెలుగు సినిమాలతో పోలిస్తే ఇది ఎంతో నయం.

దేన్నీ పట్టించుకోకుండా ఎలా పడితే అలా బతికేసే ఈజీ గోయింగ్ కుర్రాడు.. ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటూ.. తాను ఇష్టపడే వ్యక్తులపై అతిగా కేరింగ్ చూపించే అమ్మాయి.. వీళ్లిద్దరి మధ్య సాగే ప్రేమ కథ ఇది. ఇలా పాత్రల్ని తీర్చిదిద్దుకోవడంతో కాన్ఫ్లిక్ట్ పాయింట్ వర్కవుట్ చేయడానికి మంచి అవకాశమే లభించింది దర్శకురాలికి. అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు రావడానికి ఈ మాత్రం కథ చాలు. ఐతే పేపర్ మీద కథ బాగానే అనిపించే ఈ కథను ఆసక్తికర కథనంతో నడిపించడం కీలకం. ఇలాంటి సినిమాల్లో ప్రథమార్ధం వరకు కథ పెద్దగా లేకపోయినా పర్వాలేదు కానీ.. సరదా సన్నివేశాలతో కథనం రయ్యిన సాగిపోవాలని ఆశిస్తారు ప్రేక్షకులు. ఐతే ఆ వేగం ఇందులో కనిపించదు.

ఆరంభం నుంచి చాలా మామూలు సన్నవేశాలతో సాగుతుంది ‘రంగుల రాట్నం’. ప్రత్యేకంగా చెప్పుకునే.. సరదాగా అనిపించే సన్నివేశాలు చాలా తక్కువ. ప్రియదర్శి కొంతమేర ఎంటర్టైన్ చేస్తాడు కానీ.. అది కూడా ఒక స్థాయి వరకే. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా అంతగా మెప్పించదు. ప్రథమార్ధంలో స్ట్రైకింగ్ అనిపించేది ఇంటర్వెల్ ముంగిట వచ్చే మలుపే. హీరో తల్లి విషయంలో జరిగే పరిణామం కదిలిస్తుంది. కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. దీనికి ఇచ్చిన ప్రాధాన్యం చూస్తే ద్వితీయార్ధమంతా దీని ఆధారంగానే నడుస్తుందన్న భావన కలుగుతుంది. కానీ ఒక దశ దాటాక ఈ విషయాన్ని తెర మీద పాత్రలు.. చూస్తున్న మనం కూడా మరిచిపోతాం. ద్వితీయార్ధంలో కథను అలా డీల్ చేయాలనుకున్నపుడు అలాంటి షాక్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదనిపిస్తుంది.

అతిగా కేర్ చూపించే హీరోయిన్ వల్ల హీరో పడే ఇబ్బందుల నేపథ్యంలో సాగే ఎపిసోడ్ అంతా చూస్తుంటే అన్నపూర్ణ వారి ‘రారండోయ్ వేడుక చూద్దాం’ గుర్తుకు రాక మానదు. ఐతే ఈ ఎపిసోడ్ కొంచెం ఫన్నీగా సాగుతుంది. ప్రియదర్శి ద్వితీయార్దంలోనూ అక్కడక్కడా కొంచెం రిలీఫ్ ఇస్తుంటాడు. చివరి అరగంటలో ‘రంగుల రాట్నం’ ప్రభావవంతంగా అనిపిస్తుంది. హీరో తల్లి పాత్రను మళ్లీ సీన్ లోకి తీసుకురావడం బాగుంది. అక్కడ మాత్రం కొంచెం ఫీల్ తీసుకురాగలిగారు. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. దీన్ని కొసమెరుపుగా చెప్పొచ్చు. సినిమా అంతా ఇలాగే సాగి ఉంటే బాగుండేదే అనిపించేలా ఉంటుంది ముగింపు. హీరోయిన్ పాత్ర కొంచెం యాక్టివ్ గా ఉండి ఉంటే సినిమాలో కూడా వేగం వచ్చేదేమో అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ‘రంగుల రాట్నం’ జస్ట్ ఓకే అనిపించే సినిమా. ఇది మరో ‘ఉయ్యాల జంపాల’ మాత్రం కాదు.

నటీనటులు: రాజ్ తరుణ్ సినిమాకు పెద్ద బలంగా నిలిచాడు. సహజంగా సాగే అతడి నటన ఆకట్టుకుంటుంది. సరదా సన్నివేశాలతో పాటు సీరియస్ ఎపిసోడ్లలో కూడా అతను ఆకట్టుకున్నాడు. తన ప్రపంచం తల్లకిందులైన సంద్భంలో అతడి నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. హీరోయిన్ చిత్ర శుక్లా ఓకే అనిపిస్తుంది. అందం విషయంలో యావరేజ్. బాగానే నటించింది కానీ మరీ డల్లుగా కనిపిస్తుంది. సీనియర్ నటి సితార చక్కగా నటించి తన పాత్రను పండించింది. ప్రియదర్శి తనదైన శైలిలో కామెడీ పండించాడు. అతడున్న సన్నివేశాలు సినిమాలో పెద్ద రిలీఫ్. సినిమాలో మిగతా వాళ్లెవ్వరికీ చెప్పుకోదగ్గ పాత్రల్లేవు. పేరున్న నటీనటులూ లేరు.

సాంకేతికవర్గం: ప్రేమకథలకు సంగీతం బలం కావాలి. ఇంతకుముందు నాగ్ నిర్మాణంలో రాజ్ నటించిన ‘ఉయ్యాల జంపాల’కు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాలో ఒక ఫీల్ తేవడానికి ఉపయోగపడింది. శ్రీ చరణ్ పాకాల అలాంటి సంగీతం అందించలేకపోయాడు. పాటలు సోసోగా అనిపిస్తాయి. మళ్లీ వినాలనిపించేలా.. పాడుకునేలా లేవు. నేపథ్య సంగీతమూ అంతే. ఎల్.కె.విజయ్ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువల విషయంలో రాజీ పడ్డారనిపిస్తుంది. టైటిల్ కార్డ్స్ పడ్డపుడు.. మధ్య మధ్యలో ‘మనం’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాల్లోని పాటలు బ్యాగ్రౌండ్లో వినిపించినపుడు మాత్రమే ఇది అన్నపూర్ణ వారి సినిమా అన్న సంగతి గుర్తొస్తుంది. కొంచెం రిచ్ గా తెరకెక్కించి ఉంటే సినిమా విషయంలో ప్రేక్షకుల ఫీలింగ్ మరోలా ఉండేదేమో. ఇక కొత్త దర్శకురాలు శ్రీ రంజనికి పాస్ మార్కులు పడతాయి. రైటింగ్ విషయానికొస్తే ప్రధాన పాత్రల చిత్రణ.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ విషయంలో రంజని మెప్పించింది. కామెడీ డీల్ చేయడంలో ఓకే అనిపించింది. కానీ పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయింది. సినిమాను రేసీగా తీర్చిదిద్దలేకపోయింది.

చివరగా:  రంగుల రాట్నం.. ఇంకొంచెం రంగులుండాల్సింది

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS